సిటీబ్యూరో, నవంబర్ 18(నమస్తే తెలంగాణ): పాదచారులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో… బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన స్కై వాక్ వేలకు రెండేళ్లు గడిచిన మోక్షం కలగలేదు. ఉప్పల్ కేంద్రంగా నిర్మించిన స్కై వాక్ వే అందుబాటులోకి రాగా, మెహదీపట్నం స్కై వాక్ వే ఇంకా నిర్మాణంలోనే ఉంది. మిగిలిన 6 స్కై వాక్ వేల నిర్మాణం ఇప్పటికీ కాగితాలకే పరిమితమయ్యాయి.
నగరంలో స్కైవాక్‌ల నిర్మాణం పడకేసింది. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో అత్యంత రద్దీగా ఉండే కూడళ్ల వద్ద ఎలివేటెడ్ స్కై వాక్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయాలని గతంలోనే ప్రతిపాదనలు రూపొందించారు. దీంతో నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాలు, మెహదీపట్నం మార్కెట్ కూడలిలో బాటసారులకు ఇబ్బందుల దృష్యా ఈ రెండు ప్రాంతాల్లో భారీ పెడిస్ట్రియన్ వంతెనలను నిర్మించేందుకు కసరత్తు చేసినా… ఇప్పటికీ ఆ దిశగా పనులు మొదలు కాలేదు.
ముంబై హైవే, శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లే మార్గాల్లో అత్యంత ట్రాఫిక్ ఉండే మెహదీపట్నం జంక్షన్లో భారీ స్కై వాక్ వంతెన నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ఇప్పటికీ ఆ ప్రాజెక్టు ఇంకా పిల్లర్ల దశలోనే కొట్టుమిట్టాడుతోంది. సిటీ బస్సులు ఓవైపు, ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలతోపాటు, నిత్యం వేలాదిగా ఐటీ కారిడార్‌కు ప్రయాణించే వాహనదారులతో ఈ ప్రాంతం కిక్కిరిపోతున్నది. దీంతో వాహన రాకపోకలు, రైతు బజార్ ట్రాఫిక్‌తో ఆ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. బాటసారులు కూడా నడిచే పరిస్థితి లేకపోవడంతో ప్రమాద రహిత కూడళ్లు నగరంలో లేకుండా పోతున్నాయి.
మెహదీపట్నంలో స్కైవాక్ నిర్మాణ పనులు దాదాపు రెండేళ్లుగా సాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఆ ప్రాజెక్టు నిర్మాణ దశలోనే ఉండటంతో… పాదాచారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎలివేటర్లు, ఇంటర్మీడియట్ టన్నెల్ వాక్‌లతో రైతుబజార్, బస్ బే ఏరియా, డిఫెన్స్ కంపౌండ్ వాల్, ఆసిఫ్ నగర్ ఠాణా, రేమండ్ షోరూం వద్ద ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలలో నిర్మించేందుకు హెచ్ఎండీఏ ఏర్పాట్లు చేశారు. అందుకు అనుగుణంగానే ప్రాజెక్టులు పనులు చేపట్టారు.
ఇక నిత్యం లక్షలాది మంది రాకపోకలు సాగించే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో భారీ స్కై వాక్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అందుబాటులో మెట్రో, రైల్వే, బస్ స్టేషన్లను కలుపుతూ… భారీ స్కై వాక్ నిర్మించేందుకు రైల్వే, హెచ్ఎండీఏ- ఉమ్టా ప్రణాళికలు రూపొందించారు. ఇందులోనూ భూ సేకరణ తలనొప్పి లేకుండా ప్రాజెక్టు సాధ్యసాధ్యాలను కూడా పరిశీలించారు.
కానీ ఇప్పటివరకు ఆ ప్రాజెక్టు నిర్మాణం కూడా కాగితాలకే పరిమితం కాగా, ఇదే తరహాలో నగరంలో లక్డీకాపూల్ పెట్రోల్ బంక్, బీహెచ్ఈఎల్, జేఎన్టీయూ, మియాపూర్ టీ జంక్షన్లలో స్కైవాక్ వేల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ కేవలం ఉప్పల్ వాక్ వే మినహా ఏ ఒక్కటీ అందుబాటులోకి రాలేదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు అనుసంధానంగా స్కైవాక్ నిర్మాణానికి డీపీఆర్ తయారీకి కన్సల్టెన్సీని నియమించారు. కానీ ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తుందో చెప్పలేని స్థితిలో ఆ ప్రాజెక్టులు ఉన్నాయి.