నగర పాదచారుల కష్టాలు తీర్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్కైవాక్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల ప్రాజెక్టులకు కాంగ్రెస్ పాలనలో గ్రహణం పట్టింది. కోట్లాది రూపాయాలతో ఐఐటీ హైదరాబాద్ వంటి సంస్థలతో అధ్యయనం చేయించి, సమస్య తీవ్రతను గుర్తించినా, కొత్త ప్రభుత్వం ఆ నివేదికలను బుట్టదాఖలు చేస్తోంది. ప్రజాపాలన పేరిట గొప్పలు చెప్పుకునే సర్కారు.. జనం రోడ్లు దాటలేక ప్రాణాలు వదులుతున్నా పట్టించుకోవడం లేదని నగరవాసులు ఆవేదన చెందుతున్నారు.
సిటీబ్యూరో, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరించడంతో పాటు రోడ్లపైకి వచ్చే వాహనాలు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను వినియోగించే ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో పాదచారులకు ప్రధాన జంక్షన్ల నుంచి రోడ్డు దాటాలంటే భారీగా పెరిగిన వాహనాలతో తీవ్ర ఇబ్బందిగా మారింది. పాదచారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రధాన జంక్షన్ల వద్ద భారీ స్కైవాక్ వేలను హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ సర్కార్ ని ర్మించింది. ఇందులో రెండింటిని కార్యరూపంలోకి తీసుకురాగా, ఉప్పల్ జంక్షన్లో ఉన్నది అందుబాటులోకి వచ్చింది. మెహదీపట్నంలో ఏర్పాటు చేసిన స్కైవాక్ వే పనులు సాగుతున్నాయి. అయితే వీటితోపాటు మరో ఆరింటిని కూడా నిర్మించేలా అప్పట్లోనే ప్రతిపాదనలు, ప్రణాళికలు రూపొందించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఆయా పనులు మూడేళ్ల కిందటే నిలిచిపోయాయి.
బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఆథారిటీ(హెచ్ఎండీఏ) నగరం అంతటా పాదచారుల సౌకర్యాలపై ఐఐటీ హైదరాబాద్‌తో ప్రత్యేకంగా అధ్యయనం చేయించింది. ఇందులో అత్యంత ప్రమాదకరమైన 20 ప్రాంతాలను గుర్తించగా, ఆరు జంక్షన్లను అత్యంత ప్రాధాన్యత కలిగినవిగా తేల్చింది. ఈ జాబితాలో అఫ్జల్‌గంజ్ జంక్షన్, లక్డీకాపూల్ (ఏసీ గార్డ్స్ వైపు), బీహెచ్ఈఎల్ జంక్షన్, జేఎన్టీయూ జంక్షన్, మదీనా జంక్షన్, మియాపూర్ టీ జంక్షన్ అత్యవసరం అని తేల్చింది. ఈ ప్రాంతాల్లో ప్రతిరోజు వేలాది మంది ప్రజలు ప్రాణాలకు తెగించి రోడ్లు దాటుతున్నారు. ముఖ్యంగా జేఎన్టీయూ వంటి రద్దీ ప్రాంతాల్లో విద్యార్థులు, ఉద్యోగుల సంఖ్య అత్యధికంగా ఉంటుంది. ఇక్కడ నిత్యం వాహనాలకు, పాదచారులకు మధ్య ప్రమాదాలు అనివార్యంగా మారాయి. ప్రమాదాల్లో ప్రాణాలు పోయిన సందర్భాలు ఉన్నాయి. పలు నివేదికలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. ఈ క్రమంలో ఇక్కడ తప్పనిసరిగా ఫుట్ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే గత ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులను పక్కనపెట్టి, కేవలం భూసేకరణ ఇబ్బందులు, రైతుల భూములతో ముడిపడి, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనువైన ప్రాజెక్టులను చేపడుతుందనే ఆరోపణలు ఉన్నాయి.
నగర రవాణా వ్యవస్థను గాడిలో పెట్టే హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ సైతం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిస్తేజంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. హుమ్టాలో జరిగే మేథోమథనం కేవలం కాగితాలకే పరిమితం అవుతుంది. నగరంలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా రవాణా మౌలిక సదుపాయాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విమర్శలున్నాయి. గ్రేడ్ సెపరేటెడ్ కనెక్టివిటీ ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం పాదచారుల ప్రాణాల మీదకు వస్తోంది. ఇప్పటికైనా అధ్యయనాల పేరుతో కాలయాపన మాని బీఆర్ఎస్ హయాంలో తీసుకువచ్చిన ప్రాజెక్టులను పూర్తిచేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.