సిటీబ్యూరో, జనవరి 25 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కేంద్రంగా ఏరోస్పేస్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్కైరూట్ స్టార్టప్ కొత్తగా విస్తరణపై దృష్టి సారించింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఏరోస్పేస్ పార్కులో ఇంటిగ్రేషన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది.
ఈ కేంద్రంలో మైక్రో శాటిలైట్ అసెంబ్లీ సౌకర్యంతో చిన్న రాకెట్లను తయారు చేసేందుకు వీలుగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం పనులు పురోగతిలో ఉండగా, త్వరలోనే దీన్ని అధికారికంగా ప్రకటించి వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించనున్న సమాచారం. కాగా తెలంగాణ ప్రభుత్వం తరపున దేశంలోనే మొట్టమొదటిదిగా ఇంటిగ్రేటెడ్ రాకెట్ డిజైన్, మాన్యుఫాక్చరింగ్ అండ్ టెస్టింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని గతంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ప్రతిపాదన దశలో ఉన్నాయి.