మెహిదీపట్నం, జూలై 14 : హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో అస్థిపంజరం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాంపల్లి ముర్గి మార్కెట్ ప్రాంతంలో ఓ ఇంట్లో గత 7 ఏండ్లుగా ఎవరూ నివాసం ఉండడం లేదు. ఈ ఇంటి యజమాని విదేశాలకు వెళ్లాడు. ఇదిలా ఉండగా సోమవారం ఉదయం ఓ బాలుడు క్రికెట్ బాల్ తెచ్చుకోవడానికి ఆ ఇంట్లోకి వెళ్లాడు.
అక్కడ ఓ అస్థిపంజరం కనిపించింది. వెంటనే భయంతో బయటికి పరుగుతీసి.. అందరికీ విషయం చెప్పాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆ అస్థిపంజరం ఎవరిదని స్థానికంగా ఆరా తీశారు. ఘటనా స్థలాన్ని సౌత్ వెస్ట్‌జోన్ డీసీపీ చంద్రమోహన్, ఆసిఫ్‌నగర్ ఏసీపీ కిషన్‌కుమార్ పరిశీలించారు. కేసు దర్యాప్తులో ఉంది.