Hyderabad | ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 29: హబ్సిగూడలో లారీ ఢీకొని ఆరో తరగతి విద్యార్థిని దుర్మరణం పాలైంది. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తార్నాక డివిజన్ హనుమాన్ నగర్ స్ట్రీట్ నంబర్ 12లో నివాసముండే సంతోషి, నీల్‌కుమార్ దంపతుల పెద్ద కూతురు కామేశ్వరి (10) ఓ ప్రైవేటు స్కూల్లో ఆరో తరగతి చదువుతోంది. కుమారుడు వేదాంశ్ సైతం అదే పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. రోజులాగే మధ్యాహ్నం పాఠశాల నుంచి పిల్లలను తీసుకుని సంతోషి తన ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరారు.
హబ్సిగూడలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో కిందపడిపోయారు. కామేశ్వరి కాళ్లపై నుంచి లారీ వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా, వైద్యులు అప్పటికే కామేశ్వరి చనిపోయిందని నిర్ధారించారు. లారీ డ్రైవర్ మియారామ్ జట్ (40)ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో కూతురిని పట్టుకొని.. తల్లి కన్నీరుమున్నీరుగా విలపించడం చూపరులను కంటతడిపెట్టించింది.
2న కలెక్టరేట్ల ముట్టడి
చిక్కడపల్లి, ఆగస్టు 29: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కులగణన వెంటనే ప్రారంభించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. బీసీ సంక్షేమ సంఘం, బీసీ కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కులగణనను వెంటనే ప్రారంభించాలని, బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 2న జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈమేరకు గురువారం కవాడిగూడలోని బీసీ భవన్లో కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ గణేశాచారి, బీసీ కుల సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ బాలగోని బాల్‌రాజ్ గౌడ్ తదితర నాయకులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు విక్రమ్ గౌడ్,మాదేశు రాజేందర్, కనకాల శ్యామ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
దైవ దర్శనానికి వెళ్లొస్తూ.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు
రోడ్డు ప్రమాదంలో నలుగురి దుర్మరణం
మాదన్నపేట, ఆగస్టు 29 : దైవ దర్శనానికి వెళ్లొస్తూ..రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలోని భూత్పూర్ మండలం అన్నాసాగర్ వద్ద చోటుచేసుకుంది. కుర్మగూడ డివిజన్ వాసులైన ఎనిమిది మంది మంగళవారం కారులో తిరుపతి వెళ్లారు. దైవదర్శనం అనంతరం తిరుగుప్రయాణమయ్యారు. ఈ క్రమంలో భూత్పూర్ వద్ద ఆగి ఉన్న లారీని వీరి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అశోక్‌యాదవ్, వెంకటరమణరావు, వెంకట్ యాదవ్, కెంపురావు యాదవ్ చనిపోగా, మిగతా నలుగురు సువర్ణ, అంబిక, గోవింద్ అక్షిత గాయపడ్డారు. వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.