Hyderabad | చార్మినార్, మే 31: నిషేధిత ఈ సిగరెట్ అమ్మకాలు సాగిస్తున్న సభ్యులను సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ సైదబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మంగల్ హాట్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ఇద్రిస్ (22), మల్లేపల్లి ప్రాంతానికి చెందిన ఆమీర్ ఖాన్ (20), సంతోష్ నగర్ ప్రాంతానికి చెందిన మొహమ్మద్ అసద్ (23) ముగ్గురు విభిన్న పనులు చేస్తున్నారు. అయితే వాళ్లు చేస్తున్న వృత్తిలో తక్కువ ఆదాయం వస్తుండటంతో అదనపు సంపాదన కోసం అక్రమ మార్గం ఎంచుకున్నారు. అధిక మొత్తంలో డబ్బులు సంపాదించేందుకు అక్రమంగా ఈ సిగరెట్లు అమ్మాలని ప్లాన్ వేసుకున్నారు.
ఈ క్రమంలోనే ఢిల్లీకి చెందిన షాకీర్‌ను ఆన్లైన్లో సంప్రదించి.. అతని నుంచి ఈ సిగరెట్లను దిగుమతి చేసుకుని హైదరాబాద్‌లో విక్రయించేవారు. వీరు చేస్తున్న వ్యాపారం గురించి విశ్వసనీయ సమాచారం అందడంతో శనివారం ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతంలో ఢిల్లీ నుంచి వచ్చిన ఈ సిగరెట్ల ఆర్డర్‌ను తీసుకోవడానికి వచ్చిన ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి వివిధ బ్రాండ్ల పేర్లు కలిగిన సుమారు రూ.6లక్షల విలువైన ఈ సిగరెట్లు, రెండు ద్విచక్రవాహనాలు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.