బేగంపేట/మారేడ్‌పల్లి, జూన్ 26: బేగంపేటలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆరుగురు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన బుధవారం బేగంపేటలో కలకలం రేపింది. ఉత్తర మండలం డీసీపీ రష్మీ పెరుమాళ్, బేగంపేట ఇన్స్పెక్టర్ రామయ్య కథనం ప్రకారం.. బేగంపేట పాటిగడ్డ ప్రాంతానికి చెందిన ఉస్మాన్ (25) చేతికి దొరికిన పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఉస్మాన్ చిన్ననాటి స్నేహితుడైన ఎజాజ్ కోడలును కొంత కాలంగా ప్రేమిస్తున్నాడు. ఆ యువతి ఈ ప్రేమ వ్యవహారం కుటుంబసభ్యులకు తెలియకుండా జాగ్రత్తగా నడుచుకుంటోంది.
అయితే, వారం రోజుల కిందట ఉస్మాన్ నేరుగా ఆమె ఇంటికి వెళ్లి మాట్లాడుతూ.. తాను ఆ యువతిని పెండ్లి చేసుకుంటానని చెప్పాడు. దీంతో ఆమె మామ ఎజాజ్ పలుమార్లు అతడిని హెచ్చరించాడు. యువతి తల్లిదండ్రులు ఆమెకు పెండ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ విషయాన్ని ఉస్మాన్‌కు చెప్పినా.. ఆమెనే పెండ్లి చేసుకుంటానని మొండికేశాడు. దీంతో ఉస్మాన్ ఇటీవల యువతికి సంబంధించిన స్నాప్‌షాట్ నకిలీ ఐడీని సృష్టించి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో యువతి కుటుంబసభ్యులు ఆగ్రహానికి గురయ్యారు. దీంతో ఎజాజ్ తన స్నేహితులైన మహ్మద్ ఫెరోజ్, షాహిల్ఖాన్, మహ్మద్ ఫజల్, మహ్మద్ రషీద్, మరో బాలుడితో కలిసి ఉస్మాన్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు.
మంగళవారం రాత్రి 11.40 గంటల సమయంలో ఉస్మాన్ తన సోదరితో వస్తున్నట్టు ఎజాజ్ తెలుసుకున్నాడు. పాటిగడ్డ గణపతి మండపం వద్దకు చేరుకున్న ఉస్మాన్‌ను బైక్ పైనుంచి కిందకు పడేసి.. తమ వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. అనంతరం మిగిలిన స్నేహితుల సహకారంతో కత్తితో దాడి చేయగా.. ఉస్మాన్ మృతి చెందాడు. ఉస్మాన్ సోదరి కేకలు వేయడంతో నిందితులు పారిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఉస్మాన్ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకొని.. విచారణ అనంతరం పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు
సిటీబ్యూరో, జూన్ 26 (నమస్తే తెలంగాణ): సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు టీ హబ్ కొత్త కార్యక్రమాన్ని బ్లిట్జ్ పేరుతో ప్రారంభించింది. కేవలం 45 రోజుల్లో ఆలోచనలను ప్రోటోటైప్‌గా మార్చడానికి టీ హబ్ ప్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ మొదటి విడతను చేపట్టింది. ఈ సందర్భంగా టీ హబ్ సీఈఓ ఎం.ఎస్.రావు మాట్లాడుతూ.. స్టార్టప్‌లను ప్రారంభించాలనే ఆలోచనల ఉన్న వారికి అవసరమైన మార్గదర్శనం ఇవ్వడంతో నిర్ణీత సమయంతో ఒక ఆలోచనను స్టార్టప్‌గా మార్చేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ బ్లిట్జ్ ప్రోగ్రామ్‌లో ఉంటాయని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న కొత్త టెక్నాలజీతో స్టార్టప్‌లను ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉన్న వారిని ప్రోత్సహించేందుకు మొదటి విడతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.