కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 9 : అప్పటి దాకా తన అన్నతో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్న ఏడాది వయస్సు గల ఓ చిన్నారి.. తన అన్న ట్యూషన్‌కు వెళ్తుండగా బాయ్ చెప్పేందుకు ఎంతో ప్రేమతో ఆ చిన్నారి రెండవ అంతస్తు రూమ్ ముందు గ్రిల్స్ వద్దకు వచ్చింది. గ్రిల్స్ పట్టుకొని కింద ఉన్న అన్నను చూస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి మృత్యువు ఒడిలోకి వెళ్లింది. ఈ సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకున్నది. ఎస్సై లావణ్య తెలిపిన ప్రకారం…సుభాష్‌నగర్ డివిజన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఎండీ నజీమ్, పర్వీన్ దంపతులకు నలుగురు సంతానం. కాగా, వీరు ఓ భవనంలో రెండో అంతస్తులో అద్దెకు ఉంటున్నారు.
ఈనెల 8న సాయంత్రం ఆరేండ్ల పెద్ద కొడుకు అద్నాన్ ట్యూషన్ కు వెళ్తున్నాడు. ఇదే క్రమంలో సిద్ర ఆనం(సంవత్సరం) వయస్సు గల చిన్న కూతురు తన అన్నకు బాయ్ చెప్పేందుకు డోర్ ముందు ఉన్న గ్రిల్స్ వద్దకు వచ్చి కింద తన అన్నను చూస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు గ్రిల్స్ జారీ కిందపడింది. దీంతో గాయాలపాలైన చిన్నారిని హుటాహుటిన నగరంలోని నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతూ చిన్నారి ఆదివారం మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.