జవహర్‌నగర్ డంపింగ్ యార్డు విషం చిమ్ముతున్నది. భరించలేని వాసన.. విపరీతమైన దోమలు, ఈగలు.. రాత్రి అయితే నిద్రపోలేని దుస్థితి.. పరిసర గ్రామాలన్నీ దుర్గంధం .. ఇదీ జవహర్‌నగర్ డంపింగ్ యార్డు పరిసర ప్రాంతాల ప్రజలు అనుభవిస్తున్న నరకం. మహానగరం చెత్తనంతా జవహర్‌నగర్‌లోనే డంప్ చేస్తుండటంతో సుమారు 20 గ్రామాలపై తీవ్ర ప్రభావం పడుతున్నది. 5 లక్షలకు పైగా ప్రజలు.. దుర్వాసన..జల..వాయు..భూ కాలుష్యంతో అల్లాడిపోతున్నారు. చర్మ, శ్వాసకోశ వ్యాధులతో అవస్థలు పడుతున్నారు. ఇంత వేదన భరిస్తున్నా.. ఇన్ని బాధలు పడుతున్నా.. జవహర్‌నగర్ వాసుల కన్నీటి వ్యథను కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదు. తాము పడుతున్న బాధలను ప్రజలు అనేక సార్లు విన్నవించినా.. కనికరించడం లేదు. .వినిపించుకోవడం లేదు. ‘దుర్వాసన భరించలేక పోతున్నాం.. కాలుష్యం వల్ల వస్తున్న వ్యాధులతో చావలేక బతుకుతున్నాం’ అని డంపింగ్ యార్డు బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో జవహర్‌నగర్ వాసుల కన్నీటి కష్టాలు..అక్కడి దుస్థితిని కండ్లకు కట్టేలా వరుస కథనాలు అందించేందుకు ‘నమస్తే’ సిద్ధమైంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెత్తను తరలించేందుకు నూతన డంపింగ్ యార్డు ఏర్పాటుకు కసరత్తు జరుగుతున్నది. ప్రస్తుతం సిటీతో పాటు చుట్టుపక్కల ఉన్న చెత్త మొత్తాన్ని మేడ్చల్ జిల్లాలోని జవహర్‌నగర్‌కు తరలిస్తున్నారు. రోజుకు సుమారు 11 వేల మెట్రిక్ టన్నుల చెత్త జవహర్‌నగర్‌లో పోగుపడుతున్నది. జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు భారం తగ్గించేందుకు ప్రత్యామ్నాయంగా నగరం శివారు ప్రాంతాల్లో నూతనంగా డంపింగ్ యార్డును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా కొత్తూర్ మండలంలోని సిద్ధాపూర్ గ్రామ శివారులో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. అందులో భాగంగా గ్రామంలోని టీజీఐఐసీకి చెందిన భూములను ఎంపిక చేశారు.
జీహెచ్ఎంసీ సిఫార్సు మేరకు టీజీఐఐసీ 86 ఎకరాల భూమిని రాంకీ సంస్థకు కేటాయించింది. ఆ భూముల్లో 4000 టన్నుల సామర్థ్యం కలిగిన డంపింగ్ యార్డు ఏర్పాటు చేసేందుకు రాంకీ సంస్థ సన్నాహాలు చేస్తున్నది. అందులో భాగంగా కాలుష్య నియంత్రణ మండలి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నది. వీలైనంత తొందరగా డంపింగ్ యార్డును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కూడా అనుమతులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధాపూర్లో 340 ఎకరాల అసైన్డ్ భూమిని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌తో పాటు ఐటీ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు టీజీఐఐసీకి అప్పగించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పలు ఇండస్ట్రీలతో పాటు డంపింగ్ యార్డు కేటాయించినట్లు తెలుస్తున్నది.
– సిటీబ్యూరో, జూన్ 20 (నమస్తే తెలంగాణ)

సిటీబ్యూరో, జూన్ 20 (నమస్తే తెలంగాణ) :సిద్ధాపూర్లో 4 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన డంపింగ్ యార్డును 86 ఎకరాల్లో రూ.86 కోట్లతో ఏర్పాటు చేసేందుకు రాంకీ సంస్థ అన్ని అనుమతులు తీసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తున్నది. హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్‌డబ్ల్యూ లిమిటెడ్ కంపెనీ పేరిట అనుమతులకు రామ్కీ సంస్థ తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలికి దరఖాస్తు చేసుకున్నది. ఈ ప్రాజెక్టును మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫెసిలిటీ విత్ఔట్ ల్యాండ్ ఫిల్ పేరిట చేపట్టనున్నట్లు పేర్కొన్నది.
ప్రాజెక్టులో భాగంగా 200 టీపీడీ (టన్ పర్ డే) సామర్థ్యం కలిగిన మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ, 200 టీడీపీ సామర్థ్యంతో ఫుడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్, 18 టీపీడీ సామర్థ్యం కలిగిన బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. చెత్త నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు 24 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్‌ను నిర్మించనున్నట్లు ప్రాజెక్టు విధి విధానాల్లో పేర్కొన్నారు. చెత్తను రీసైక్లింగ్, రీయూస్ విధానంలో నిర్వహించనున్నట్లు తెలుస్తున్నది. జవహర్‌నగర్ డంపింగ్ యార్డు తరహాలో చెత్తను నిల్వ ఉంచకుండా దీనిని ఏర్పాటు చేయనున్నారు. సేకరించిన 4 వేల మెట్రిక్ టన్నుల చెత్త మొత్తాన్ని ప్రాసెసింగ్ చేసి పరిసర ప్రాంతాలు కలుషితం కాకుండా నిర్వహించనున్నట్లు దరఖాస్తులో వెల్లడించింది.
కొద్దిరోజులుగా ప్రజల ఆందోళనలు
సిద్ధాపూర్లో డంపింగ్ యార్డును ఏర్పాటు చేస్తారని తెలిసినప్పటి నుంచి పరిసర ప్రాంతాల్లోని తండాలు, ఇతర గ్రామాల ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు. కొద్దిరోజులుగా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. ఇక్కడ ఇతర ప్రాంతాల నుంచి సేకరించిన చెత్తను పడేయొద్దని కోరుతున్నారు. డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం వల్ల కాలుష్యం బారిన పడతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలు సైతం ప్రజలతో పాటు ఆందోళనల్లో పాల్గొంటున్నారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల గాలి, నేల, భూగర్భ జలాలు కలుషితమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని డంపింగ్ యార్డును ఏర్పాటు చేయొద్దని డిమాండ్ చేస్తున్నారు.
చెత్తను తెచ్చి మా మీద పడేయొద్దు
– పట్లావత్ చందర్, పులిచర్లకుంట తండా
మా తండా ప్రభుత్వం డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రాంతం పక్కనే ఉంది. పచ్చని పంట పొలాలతో కళకళలాడుతున్న మా ప్రాంతాన్ని డంపింగ్ యార్డు తెచ్చి కలుషితం చేయొద్దు. సిద్ధాపూర్లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలనే ఆలోచనను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. డంపింగ్ వల్ల జవహర్‌నగర్ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక్కడ డంపింగ్ యార్డును ఏర్పాటు చేస్తే మాకు కూడా అలాంటి దుస్థితే పడుతుంది. ఎక్కడో ఏర్పడిన చెత్తను తీసుకొచ్చి మా మీద పడేస్తామంటే చూస్తూ ఊరుకోబోం. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం.
ఐటీ భూముల్లో..చెత్త వేస్తారా?
గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం సిద్ధ్దాపూర్ భూములను ఐటీ పార్కు కోసం కేటాయించింది. ఈ ప్రాంతంలో రైతులు టమాట పంటను ఎక్కువగా పండిస్తారు.. ఇందులో కొంత భూమిని టమాట ప్రాసెసింగ్ యూనిట్ కోసం కూడా కేటాయించారు. విలువైన భూములను ప్రజల ప్రయోజనం కోసం వినియోగించాలే తప్ప.. ఈ ప్రాంతాన్ని కలుషితం చేసే చెత్త డంపింగ్ యార్డుకు ఎలా కేటాయిస్తారు. పైగా ఈ ప్రాంతం నుంచి వర్షపునీరు పాటు కాలువల ద్వారా హిమాయత్‌సాగర్‌లో కలుస్తాయి. అలాంటప్పుడు చత్త డంపింగ్‌యార్డును ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే ఈ నీరు అంతా సాగర్‌లో కలిసి నగరానికి నీరందించే నీరు కలుషితం కాదా? టన్నులకొద్ద్దీ చత్తను తీసుకొచ్చి ఇక్కడ నిల్వ చేస్తే ఇక్కడి ప్రజలు ఎలా జీవనం సాగిస్తారు. ఈ భూమిని రాంకీ సంస్థకు అప్పగించినట్లు తెలిసింది. ఈ ప్రాంతంలో చెత్త డంపింగ్‌యార్డును నిర్మిస్తే ఒప్పుకునే పరిస్థితి లేదు.