బాలానగర్, జూలై 17 : బాలానగర్ డివిజన్లో అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తున్నది. అభివృద్ధి పనులు బాలానగర్‌లో చురుకుగా కొనసాగుతున్నాయి. ఇందులో ప్రధానంగా భూగర్భ డ్రైనేజీ పనులు, సీసీరోడ్లు, బీటీరోడ్లు, తాగునీటి పైప్ లైన్ పనులు, శ్మశాన వాటికల అభివృద్ధి, కమ్యూనిటీహాల్స్ నిర్మాణంతో పాటు షటిల్ కోర్టు నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేశారు. కల్యాణ్‌నగర్‌లో రూ.77 లక్షల నిధులతో చేపట్టిన షటిల్ కోర్టు నిర్మాణ పనులు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉంది. షటిల్ కోర్టును త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కల్యాణ్‌నగర్‌లో షటిల్ కోర్టు అందుబాటులోకి వస్తే కాలనీవాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. కల్యాణ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన షటిల్‌కోర్టులో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించారు. అంతేగాక షటిల్‌కోర్టు ఆవరణలో గ్రీనరీ కోసం కొంత స్థలాన్ని కేటాయించారు. ఖాలీ స్థలంలో గ్రీనరీ ఏర్పాటు చేయడం ద్వారా కాలనీవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులోకి రానున్నది.
కోట్లాది నిధులతో చేపట్టిన వివిధ పనులు
బాలానగర్ డివిజన్ పరిధి వినాయక్‌నగర్‌లోని రెండు ప్రాంతాలలో రూ.71 లక్షలతో సీసీరోడ్డు పనులు చేయడానికి పాత రోడ్డును తొలగించి కొత్త రోడ్డు పనులు పూర్తయ్యాయి. దామొదరం సంజీవయ్యకాలనీలో రూ.20 లక్షలతో చేపట్టిన సీసీరోడ్డు పనులు పూర్తి చేశారు. దిల్కుశ్నగర్లో రూ.1.2 కోట్ల నిధులతో అంతర్గత రహదారులు(సీసీరోడ్డు పనులు)చెరబండరాజునగర్లో రూ. 50 లక్షల నిధులతో కమ్యూనిటీహాల్ నిర్మాణ పనులు, ఇంద్రానగర్‌లో 2.46 కోట్ల నిధులతో సీసీరోడ్డు, భూగర్భ డ్రైనేజీ పనులు, రాజీవ్‌గాంధీనగర్‌లో రూ. 24 లక్షలతో లేయింగ్ సీసీరోడ్డు పనులు, శ్రీశ్రీనగర్ కమాన్ వద్ద రూ. 24 లక్షలతో లేయింగ్ సీసీరోడ్డు పనులు, రూ.30 లక్షలతో ఇంద్రానగర్‌లో కమ్యూనిటీహాల్ నిర్మాణ పనులు, మరో రూ 39 లక్షలతో హిందూ శ్మశానవాటిక దగ్గర సీసీరోడ్డు పనులు, ప్లాట్ నంబర్1 నుంచి 171 రోడ్డుకు సీసీరోడ్డుకు రూ.36 లక్షలు, పోచమ్మ ఆలయం పక్కన సీసీరోడ్డు పనులకు రూ.25 లక్షలు, రాజుకాలనీ రోడ్డులో సీసీరోడ్డు పనులకు రూ.18 లక్షలతో చేపట్టిన పనులు శరవేగంగా జరగుతున్నాయి. ఆయా పనులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులు ఆ దిశగా కృషి చేస్తున్నారు.
ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి
బాలానగర్ డివిజన్లో ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టిసారించాము. డివిజన్ పరిధిలో దీర్ఘకాలిక సమస్యలను సైతం పరిష్కరించి ప్రజలకు సేవలందిస్తున్నాం. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాము. ప్రస్తుతం బాలానగర్ డివిజన్ వ్యాప్తంగా కోట్లాది నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరలో పూర్తి కానున్నాయి.
– ఆవుల రవీందర్‌రెడ్డి, బాలానగర్ కార్పొరేటర్
ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులు
బాలానగర్ డివిజన్ పరిధిలో ఇటీవల చేపట్టిన పలు పనుల వలన ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాము. క్యూనిటీహాల్, సీసీరోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు సైతం పరిశీలిస్తూ పనులు చేయిస్తున్నాం. ఉన్నతాధికారుల సూచనల మేరకు పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తాము.
– రషీద్, ఏఈ బాలానగర్ డివిజన్