Government Schools | సిటీబ్యూరో, మే 21(నమస్తే తెలంగాణ): మరో 20 రోజుల్లో పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కలెక్టర్ ఓసారి పాఠశాలలను పరిశీలిద్దామని బయల్దేరారు. కానీ, కలెక్టర్‌కు ఆ పాఠశాలలను చూసి మైండ్ బ్లాంక్ అయ్యింది. కొన్ని పాఠశాలలు భవన పెచ్చులూ, పెంకులూడి కలెక్టర్‌ను ఆహ్వానిస్తే.., మరొకొన్ని పాఠశాలలు నిండుకున్న చెత్తతో రా రమ్మన్నాయి. ఇంకొన్ని గదుల నిండా చీకటితో స్వాగతం పలికాయి.” పాఠశాలల దుస్థితిని చూసిన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అవాక్కయ్యారు. ఇన్నాళ్లు ఏం చేస్తున్నారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలు అన్ని వసతులతో సిద్ధంగా ఉండాలని బాధ్యతలు అప్పగించినప్పటికీ ఎందుకు నిర్లక్ష్యం వహించారంటూ క్లాస్ పీకారు. అంతేకాదు పాఠశాలల్లో పనులు చేపట్టాలని ఆదేశాలిచ్చి నిర్లక్ష్యం వహించిన డీఈఓ రోహిణీ, ఇన్చార్జ్ డీఈఓ, అసిస్టెంట్ డైరెక్టర్ బి.శ్రీనివాస్‌లకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి షోకాజ్ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
పాఠశాలలు సిద్ధం కావాలి
ఇప్పటికే జిల్లాలో పాఠశాలలు సకల వసతులతో రూపుదిద్దుకోవాలి. ఆ బాధ్యతలను సంబంధిత అధికారులకు గతంలోనే కలెక్టర్ అప్పగించారు. కానీ, కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా నగరంలోని అమ్మ ఆదర్శ పాఠశాలల వసతులు ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..’ అన్న చందంగా దర్శనమిస్తున్నాయి. కాచిగూడలోని తులసీరామ్ నగర్లో ప్రభుత్వ ప్రాథమిక ఇంగ్లిష్ మీడియం స్కూల్ పరిసరాలన్నీ చెత్తతో నిండిపోయాయి. కనీస చర్యలు కూడా తీసుకోలేదు. సైదాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలను సైతం కలెక్టర్ సందర్శించారు. అనంతరం, అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనులను త్వరిగత గతిన పూర్తి చేయాలని సూచించారు. ప్రతి పేరేంట్ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించేలా పాఠశాలు ఉండాలన్నారు. జిల్లాలో 440 పాఠశాలల్లో తాగునీరు. బెంచీలు, టాయిలెట్స్, ఎలక్ట్రిసిటీ, పెయింటింగ్, గ్రీన్ చాక్బోర్డు తదితర అన్ని వసతులు సమకూర్చాలని సూచించారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, టీఎస్‌ఈడబ్ల్యూడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ షఫీ మియా హాజరయ్యారు.