సిటీబ్యూరో/ తెలుగు యూనివర్సిటీ, మే 12,(నమస్తే తెలంగాణ): సర్కార్ దవాఖానల్లో చేరే రోగి సంరక్షణలో ప్రధాన పాత్ర పోషించే రెగ్యులర్ డైటీషియన్లు లేకపోవడం మూలానా పోషకాలు లేని తిండే గతైతోంది. జిల్లా పరిధిలోని ప్రభుత్వాసుపత్రుల్లో డైట్ ప్లాన్ క్రమపద్ధతిలో అమలు చేసే చీఫ్ డైటీషియన్, డైటీషియన్ పోస్టులు భర్తీ చేయకపోవడమే దీనికి ప్రధాన కారణం. గతంలో పనిచేసిన వారంతా ఆరునెలల క్రితం బదిలీల్లో ఇతర జిల్లాలకు వెళ్లగా.. ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తోందంటూ విమర్శలున్నాయి. దీంతో సరైన పోషకాలు లేని తిండి తింటూ రోగులు కోలుకోవడంలో సమయం ఎక్కువపడుతోందనే వాదనలు ఉన్నాయి.
బీఆర్ఎస్ హయాంలో పక్కాగా అమలు
ప్రభుత్వాసుపత్రుల్లో చేరే ఇన్పేషెంట్లందరికీ ఉచితంగా మూడు పూటల పోషకాలు కలిగిన ఆహారం అందించాలని గత బీఆర్ఎస్ సర్కార్ నిర్ణయించడంతో పాటు వెంటనే అమలు చేసింది. అందులో భాగంగానే వాటిలో పోషకాల శాతం, రోగి ఆరోగ్యానికి అవసరమైన ఆహారం అందించేందుకు డైటీషియన్లను నియమించారు.
వైద్యులు, నర్సులతో కూడిన మల్టీడిసిప్లినరీ బృందంతో డైటీషియన్లు సమన్వయం చేసుకుంటూ నిరంతరం రోగికి కావాల్సిన పోషకాలతో కూడిన ఆహారాన్ని తగిన మోతాదులో అందించేవారు. సాధారణ వ్యాధులతో పాటు డయాబెటిస్, కిడ్నీ సమస్యలు, క్యాన్సర్ వంటి రోగాలతో బాధపడుతూ చికిత్స పొందుతున్న వారికి ప్రత్యేక ఆహార నియమాలు సూచిండటం, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవవాలనేది కూడా కుటుంబసభ్యులకు డైటీషియన్లే తెలియజేసేవారు.
ఖాళీల భర్తీలో తీవ్ర జాప్యం..
ఉస్మానియాకు నిత్యం 3వేల మంది ఔట్ పేషెంట్లు, 1,200మంది ఇన్పేషెంట్లు చికిత్సకోసం వస్తుంటారు. నిలోఫర్లో ఔట్పేషెంట్లు సుమారు వేయి మంది, ఇన్పేషెంట్లు 300 మంది ఉండగా కోఠి మెటర్నిటీలో నిత్యం 800 మంది ఔట్పేషెంట్లు, 200 మంది ఇన్పేషెంట్లకు వైద్య సేవలందిస్తుంటారు. ఇన్పేషెంట్లకు సరైన సమయంలో పోషకాలు కలిగిన ఆహారాన్ని అందించడంలో డైటీషియన్లు కృషిచేసేవారు.
ఇటీవల ఆయా ఆసుపత్రుల్లో ఉన్న చీఫ్ డైటీషియన్, డైటీషియన్లు బదిలీల్లో ఇతర జిల్లాలకు వెళ్లడంతో ఆ పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. ఇప్పటివరకు వారి స్థానంలో రెగ్యులర్ వారిని నియమించలేదు. ప్రస్తుతం ఉస్మానియాలో కాంట్రాక్ట్ పద్దతిలో డైటీషయన్ నియామకం కాగా, నిలోఫర్లో డిప్యూటీ సూపరింటెండెంట్, ఆర్ఎంవో స్థాయి అధికారులే అడపాదడపాగా పర్యవేక్షిస్తుండటం గమనార్హం.
సూపరింటెండెంట్ల పర్యవేక్షణ కరువు
రెగ్యులర్ డైటీషన్లను నియమించకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. నిత్యం నాణ్యతలేని, పోషకాలు లోపించిన తిండి తింటూ మరింత అనారోగ్యానికి గురవుతున్నారు. సామాన్య రోగులకు అందించే భోజనంపై ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్ల పర్యవేక్షణ లేకపోవడం మూలానా ఇష్టానుసారంగా రోగులకు ఆహారాన్ని అందిస్తున్నారు.
ఈ తిండి తింటే మరిన్ని రోజులు ఆసుపత్రిలోనే గడపాల్సి వస్తుందని భయపడి చాలా మంది రోగులు ఆ భోజనాన్ని తినకుండా చెత్తబుట్టల్లో పడేస్తున్నారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సొంతడబ్బుతో బయటినుంచి తెప్పించుకొని తింటున్నారు. వైద్య సేవల్లో ఎంతో ప్రాముఖ్యత గాంచిన ఉస్మానియా, నిలోఫర్, ప్రభుత్వ మెటర్నిటీ వంటి ఆసుపత్రుల్లో డైటీషియన్లు లేకపోవడం మూలానా రోగుల అరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. వీలైనంత మేరకు రెగ్యులర్ చీఫ్ డైటీషియన్లు, డైటీషియన్ పోస్టులను భర్తీ చేయాలంటూ రోగుల సహాయకులు అభిప్రాయపడుతున్నారు.