సిటీబ్యూరో: ట్యాంక్ బండ్ పరిసరాలను దుబాయ్ తరహా టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. హుస్సేన్ సాగర్ ప్రాంతాన్ని మొత్తం ఒక యూనిట్‌గా తీసుకుని టూరిజం వేదికగా మార్చాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో అధికారులను ఆదేశించారు. ట్యాంక్ బండ్ పరిసరాల్లో అంబేద్కర్ విగ్రహం, స్మృతి వనం, కొత్త సెక్రటేరియట్, నెక్లెస్ రోడ్డు, పీవీ ఘాట్, అమ్యూజ్మెంట్ పార్క్, ఎన్టీఆర్ పార్క్, ఇందిరా పార్క్, సంజీవయ్య పార్క్, స్కై వాక్ వే వంటివి ఉన్నాయి. వీటికి అదనంగా మరికొన్నింటితో ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడిన టూరిజం కేంద్రంగా ఆధునీకరించాలన్నారు. దీనికి దుబాయ్ టూరిజాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని ఆదేశించారు.
బీఆర్ఎస్ పాలనలోనే హుస్సేన్ సాగర్ పర్యాటకానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో భాగంగా స్కై వాక్ వే, చిల్డ్రన్ అమ్యూజ్మెంట్ పార్క్, సంజీవయ్య పార్క్ ఆధునీకరణ పనులు చేపట్టారు. అదే సమయంలో ట్యాంక్ బండ్ పరిసరాలను అందంగా తీర్చిదిద్దారు. కాగా, హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన విషయాన్ని ఏడాది కాలంగా పక్కనపెట్టిన హెచ్ఎండీఏ.. ఆ దిశగా ఏమాత్రం ప్రయత్నం చేయడం లేదు. ఈ క్రమంలోసీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన నిర్ణయాలను అమల్లోకి తీసుకువచ్చేందుకు అధ్యయనం కూడా మొదలుపెట్టలేదు.
ప్రస్తుతం ట్యాంక్ బండ్ పర్యాటకులకు బోర్ కొడుతున్నది. ఎలాంటి ప్రత్యేకతలు లేకపోవడంతో ఒకటి, రెండు సార్లు మించి విజిట్ చేయలేని పరిస్థితి. కేవలం పార్కులు, ట్యాంక్ బండ్ పరిసరాలను చూసేందుకు వీలు ఉండగా.. పర్యాటకులను హత్తుకునేంతగా ఏమీ లేవు. బీఆర్ఎస్ సర్కారు ట్యాంక్ బండ్ పరిసరాలను మోస్ట్ హ్యాపెనింగ్ జోన్‌గా తీర్చిదిద్దేందుకు వారాంతంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన సండే ఫన్ డే ఆకట్టుకున్నది. ఇదే తరహాలో కార్యక్రమాలను చేపడితే… ట్యాంక్ బండ్‌కు మళ్లీ పర్యాటకుల సందడి మొదలైతుందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు.