ఆహార ప్రియులు.. బయట తినాలంటే జర ఆలోచించాలి. ఎందుకంటే నాణ్యత లేని ఆహారం ఓ కారణమైతే.. దానికి తోడు పలు రెస్టారెంట్స్, హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో వంట గదులు అపరిశుభ్రంగా ఉండటం, గడువు ముగిసిన ముడి సరుకులను వంటల్లో వాడటం కూడా ఇందుకు కారణం. గడువు ముగిసిన ముడి సరుకులతో వండివార్చిన నోరూరించే రకరకాల ఆహార పదార్థాలను తింటే అనారోగ్యానికి బలైనట్లే. అందుకే బయట ఆహారం తినేటప్పడు కాస్త ఆలోచించాలి ఆహార ప్రియులు. ఓ పక్క ఫుడ్‌సేప్టీ విభాగం అధికారులు నాణ్యతాప్రమాణాలు పాటించని వ్యాపారులపై చర్యలు తీసుకుంటున్నా.. కానీ, నిర్వాహకుల్లో మాత్రం ఎలాంటి మార్పు కనబడటం లేదు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): సామాన్యంగా బొద్దింకలను చూస్తేనే ఒళ్లు ఝల్లుమంటుంది.. అలాంటిది ఆహారంలో కనిపిస్తే..ఆ భోజనం తినగలమా? ఈ మధ్యకాలంలో మనకు ఎక్కువగా వినిపిస్తున్న వార్త తినే ఆహారం (టిఫిన్)లో బొద్దింక దర్శనమివ్వడం. గత నెల 23న పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్ హైవే మెయిన్‌రోడ్డు ఫిల్లర్ నంబర్106 వద్ద ఉన్న శ్రీ రాఘవేంద్ర హోటల్లో ఓ కస్టమర్ తినే దోసెలో మాడిపోయిన బొద్దింక వచ్చింది. బొద్దింకను చూసి కస్టమర్ ఖంగుతిన్నాడు.
సదరు కస్టమర్ ఎక్స్ వేదికగా బొద్దింకతో కూడిన దోసెను పోస్టు చేయడం వైరల్ అయింది. తాజాగా ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు మంగళవారం నగరంలోని అశోక్‌నగర్‌లోని పలు టిఫిన్ సెంటర్లు, హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించగా వంటగదుల్లో బొద్దింకలు స్వైర విహారం చేస్తున్నాయి. బయట తినాలంటే ఆహార ప్రియులు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఓ వైపు ఫుడ్‌సేప్టీ అధికారులు నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్స్‌పై చర్యలు తీసుకుంటున్నా.. నిర్వాహకుల్లో మాత్రం మార్పు కనబడటం లేదు.
అశోక్నగర్లోనూ..
అశోక్‌నగర్‌లోని పలు హాస్టళ్లు, టిఫిన్స్ సెంటర్లలో ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు విస్తృత సోదాలు చేశారు. చేతన్ పీజీ బాయ్స్ హాస్టల్లో వంటగది అపరిశుభ్రంగా ఉండ టంతో పాటు పెద్ద మొత్తంలో బొద్దింకలు ఉన్నట్లు గుర్తించారు. డస్ట్బిన్లకు మూతలు లేకుండా తెరిచి ఉన్నాయి. అందులో పనిచేసే వారికి హెయిర్ క్యాప్స్, ఫుడ్ హ్యాండర్లు లేకుండా ఉన్నారు. దీంతో పాటు బాలాజీ దర్శన్‌లో రిఫ్రిజి రేటర్లో నిల్వ చేసిన ఫుడ్‌కు లేబుల్ లేకుండా ఉన్నాయని, వంటగదిలో పిండిగిర్ని (ైగ్లెండర్) ప్రాంతం అపరిశుభ్రంగా ఉందని, అక్కడ పచ్చిమిర్చి లాంటి వస్తువులు నిల్వ చేశారని గుర్తించారు.
వాష్‌రూం అపరిశుభ్రంగా ఉందని, వంటగది రూం పైకప్పు నుంచి వాటర్ లీకేజీలు ఉన్నాయని అధికారులు తెలిపారు. అశోక్‌నగర్ పద్మావతి టిఫిన్స్, శ్రీ సిద్ధి వినాయక ఉడిపి హోటల్ స్టోర్ రూంలో టమోటాలు పాడైనట్లు గుర్తించారు. ఆ టమోటాలతోనే చట్నీ చేస్తున్నట్లు, అదే చట్నీని కస్టమర్లకు సరఫరా చేస్తున్నట్లు తేలింది. సిద్ధం చేసిన ఆహార వస్తువులకు లేబుల్ లేకపోవ డం, వంటగది ఆవరణ అపరిశుభ్రంగా ఉండటం, వర్కర్లు హెయిర్క్యాప్స్ ధరించలేదని నిర్ధారించారు. మై హోం లగ్జరీ గర్ల్స్ హాస్టల్లో ఫ్రిజ్‌లో ఉన్న ఆహార వస్తువులకు లేబుల్స్ సరిగా లేవని, సింథటిక్ ఆహార రంగుల వినియోగం, వంటగదిలో బొద్దింకలు తిరుగుతున్నట్లు గుర్తించారు.
ఫుడ్ సేఫ్టీ దాడుల్లో విస్తుపోయే నిజాలు ..!!
కోటికి పైగా జనాభా కలిగిన గ్రేటర్లో దాదాపు 12 నుంచి 14 వేల వరకు హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయిల్ నుంచి మొదలు ఉప్పు దాకా నాణ్యమైన వాటిని వినియోగించి నిర్వాహకులు క్వాలిటీ ఫుడ్‌ను అందించాలి. జీహెచ్ఎంసీ స్టాంప్ వేసిన మాంసాన్ని వాడాలి. కానీ నిబంధనలు పక్కన పెట్టి ధనార్జనే ధ్యేయంగా హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు వ్యాపారం చేస్తున్నారు. వంటగదులు పరిశుభ్రత పాటించడం లేదు..ఫుడ్ తయారీలో ప్రతిదీ కల్తీ వస్తువులను ప్రోత్సహిస్తున్నారు. పైగా పాచిపోయిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టి తిరిగి వేడి చేసి పెడుతున్నారు. మాంసం అయితే రోజుల తరబడి ఫ్రిజ్‌లో పెట్టి దానికి మసాలాలు దట్టించి మరుసటి రోజు వాడుతున్నారు.
బిర్యానీలో బొద్దింకలు, వెంట్రుకలు వస్తున్న సందర్భాలు లేకపోలేదు..ఈ జాబితాలో చిన్న హోటళ్లు నుంచి బడా హోటళ్ల నిర్వాహకులు ఉంటున్నారు. తరచుగా జీహెచ్ఎంసీకి నిత్యం 100కు వరకు పైగా ఫిర్యాదులు ఇలాంటివే ఎక్కువగా వస్తున్నాయి. మెరుగైన పౌర సేవలు, ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా జీహెచ్ఎంసీ ఫుడ్‌సేఫ్టీ విభాగం అధికారులు కల్తీరాయుళ్ల భరతం పడుతున్నా… కొందరి నిర్వాహకుల్లో మార్పు కనబడకపోవడం గమనార్హం. అయితే ఆహార నాణ్యతాప్రమాణాల విషయంలో అనుమానాలుంటే జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబర్ 040- 2111 1111 ను సంప్రదించాలని జీహెచ్ఎంసీ ఫుడ్ సేప్టీ అధికారులు తెలిపారు.