సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): కూకట్‌పల్లిలో జరిగిన పన్నేండేండ్ల బాలిక సహస్ర హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫోరెన్సిక్ వైద్యుల పరిశీలనలో బాలిక మెడపై 15, శరీరంపై 4 కత్తిపోట్లు గుర్తించారు. పోస్టుమార్టంకు సంబంధించిన ప్రాథమిక నివేదిక అంశాలను పోలీసులకు తెలిపినట్లు సమాచారం. బాలికను అంత కసిగా ఎవరు చంపారు..? అంత పగ ఎవరికుంది..? ఈ హత్యకు క్షుద్ర పూజలతో ఏమైనా లింకు ఉందా? అనే అనుమానాలతో పాటు ఆస్తి తగాదాలు, పాత పగలు, వివాహేతర సంబంధాలు, బాలికపై లైంగిక దాడి యత్నం తదితర కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెండు రోజులవుతున్నా ఈ కేసులో నిందితులను పోలీసులు గుర్తించలేకపోయారు. తెలిసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు మొదటి నుంచి అనుమానిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే బాలిక హత్య జరిగిన భవనంలో కిరాయికి ఉంటున్న వారిని వేరు వేరుగా విచారిస్తున్నారు. అందులో ఒడిశాకు చెందిన ఒక వ్యక్తి నాలుగు నెలల క్రితం ఉద్యోగం పోవడంతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు, అతడికి ఈ హత్యకు ఏమైనా సంబంధముందా అనే అనుమానాలతో పోలీసులు విచారించారు. అయితే పోలీసుల విచారణలో ఇప్పటి వరకు హంతకుల ఆధారాలు మిగతా పక్కాగా లభించకపోవడంతో మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. హత్య ఘటన జరిగిన రెండు రోజులు కావస్తున్నా.. పన్నేండేండ్ల బాలిక సహస్ర హత్య కేసులో నిందితులను ఇప్పటికీ పోలీసులు గుర్తించలేకపోయారంటూ ఆరోపణలు వస్తున్నాయి.
సహస్ర హత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సోమవారం తల్లి, దండ్రులు తమ పనుల నిమిత్తం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన తరువాత 10.30 నుంచి 11 గంటల మధ్యనే సహస్ర హత్య జరిగి ఉంటుందని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇంట్లో నుంచి తల్లిదండ్రులు వెళ్లిపోయిన తరువాత, 12 గంటల ప్రాంతంలో తండ్రికి కొడుకు టిఫిన్ బాక్స్ తీసుకోవడానికి ఇంటికి వచ్చే వరకు మధ్యలో ఆ రూట్లో కొత్తవాళ్లు ఎవరు రాలేదని ప్రాథమికంగా పోలీసులు అంచనాకు వచ్చారు. ఘటన జరిగిన ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఆ వీధిలో ఉన్న ఇతర ప్రాంతాలలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించి ఆధారాలు సేకరించారు.
ఘటనా స్థలంలో పోలీసులు సేకరించిన శాస్త్రీయమైన ఆధారాలు, సీసీ కెమెరాలలో లభించిన ఆధారాలతో పోలీసులు ఈ కేసు చిక్కుముడిని విప్పేందుకు భిన్న కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. బాలికను కిరాతంగా హత్య చేయడం వెనుక క్షుద్రపూజలతో సంబంధాలున్నాయా? ఆ చుట్టూ పక్కల, ఇంటి పరిసరాలలో ఏమైనా ఆధారాలు లభిస్తాయా అనే కోణంలోను పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. సహస్ర తల్లిదండ్రులు 15 ఏండ్ల క్రితమే తమ స్వస్థలం నుంచి హైదరాబాద్‌కు రావడం, వారికి ఆస్తికి సంబంధించిన తగాదాలు, పాత పగలు కూడా ఎవరితోను లేనట్లు పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు.
కొత్తగా క్షుద్ర పూజల కోణం కూడా వెలుగులోకి రావడంతో ఆ దిశగా కూడా ఆరా తీస్తూ, బాధిత కుటుంబంతో ఎవరైనా క్షుద్రపూజలు చేసేవారితో పరిచయాలున్నాయా? అనే విషయాలపై కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సహస్ర ఇంటి గూర్చి అవగాహన ఉన్నవారు, ఆ కుటుంబం గూర్చి తెలిసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని, ఆ ఇంట్లో కిరాయికి ఉంటున్న వారి వద్ద నుంచి వివరాలు సేకరిస్తున్నారు. హంతకుడు ఒకడే అయి ఉంటాడని, హత్యకు వాడిన కత్తి కూడా చిన్నదేనని పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమానం ఉన్న కోణాలలో ఆయా బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. మంగళవారం బాలానగర్ డీసీపీ సురేశ్‌కుమార్ మరోసారి ఘటన స్థలిని పరిశీలించారు.