బంజారాహిల్స్,మే 4: జూబ్లీహిల్స్‌లో బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఘటనలో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. సంపన్న కుటుంబాలకు చెందిన బాలికలు, యువతులను ఇన్స్టాగ్రామ్ వేదికగా పరిచయం చేసుకుని ఖరీదైన కార్లలో తిరుగుతూ వారికి సెక్స్ ఎర వేస్తున్న నిందితుడు చంద్రశేఖర్ అజాద్ అలియాస్ అర్జున్ను జూబ్లీహిల్స్ పోలీసులు నాలుగురోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. సోమవారం నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్, ఉమెన్ సేఫ్టీ సెల్ డీసీపీ లావణ్యా నాయక్, వెస్ట్‌జోన్ డీసీపీ రమణారెడ్డితో పాటు పలువురు అధికారులు నిందితుడిని విచారించగా అనేక విషయాలు బయటకు వచ్చాయి.
జూబ్లీహిల్స్‌లో 15ఏళ్ల బాలికను లోబర్చుకుని లక్షలాది రూపాయలు కాజేయడంతో పాటు పనిమనిషి సాయంతో ఆమె ఇంట్లోకి వెళ్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన కోడూరు చంద్రశేఖర్ అజాద్‌తో పాటు అతడి సోదరుడు రాజీవ్‌లను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు చంద్రశేఖర్‌ను నాలుగురోజుల పాటు కస్టడీకి తీసుకుని అతడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్‌ను పరిశీలించగా సుమారు 20 నుంచి 25మంది యువతులతో పరిచయాలున్నట్లు తేలింది. చంద్రశేఖర్‌తో పాటు మరికొంతమంది స్నేహితులు ముఠాగా ఏర్పడి అనేకమందిని లోబర్చుకున్నట్లు గుర్తించారు.
నగరంలోని పలు పబ్స్‌కు తరచూ వెళ్తూ, ఖరీదైన కార్లను అద్దెకు తీసుకుని ఇన్‌స్టాగ్రామ్స్ రీల్స్ చేస్తూ అమ్మాయిలను ఆకర్షించారని తేలింది. సెక్స్ ఎరవేసి వారి వద్దనుంచి భారీగా డబ్బులు దండుకున్నారని గుర్తించిన పోలీసులు బాధితుల వివరాలను సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా చంద్రశేఖర్ అజాద్ చేస్తున్న నేరాల గురించి తల్లి మీనాకుమారితోపాటు అతడి మేనమామకు తెలిసినా వారు పట్టించుకోలేదని, వారిపై సైతం కేసు నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలాంటి నేరాలను భవిష్యత్తులో అరికట్టేందుకు ఉమెన్ సేఫ్టీ సెల్ విభాగం ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవాలని సీపీ ఆదేశించారు. నిందితుల సోషల్‌మీడియా అకౌంట్స్‌తో పాటు, వారి బ్యాంక్ అకౌంట్స్‌ను పరిశీలించాలని, బాధితులను గుర్తించి వారికి భరోసా కల్పించాలని సూచించారు.