Shivarampally | మైలార్దేవ్పల్లి, మే 27 : శివరాంపల్లి రైల్వే గేట్(ఎల్సీ–8) ప్రాంతంలో రోడ్డును మూసివేస్తూ అడ్డుగా నిర్మించిన ప్రహారీ గోడ కారణంగా స్థానిక ప్రాంతాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మైలార్దేవ్పల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎస్.వెంకటేష్ అన్నారు. మంగళవారం స్థానిక ప్రజలు, నాయకులతో కలిసి రైల్వే గేట్ ప్రాంతంలో బ్రిడ్జీ లేదా అండర్ బ్రిడ్జీని నిర్మించాలని కోరుతూ రైల్వే అడిషనల్ మేనేజర్ ఎం.ఎ.రెహమాన్, సీనియర్ డివిజనల్ ఇంజనీర్, కోఆర్డినేటర్ పి.టి.దుర్గాప్రసాద్లను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైల్వే గేట్ నుంచి అనేక మంది ప్రయాణం కొనసాగిస్తారన్నారు. 2022లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ దారిని మూసి వేసి గోడను నిర్మించారన్నారు. అప్పటి నుంచి స్థానిక ప్రాంతాలకు చెందిన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ 5–6 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తు వెళ్తున్నారన్నారు. ఈ విషయాన్ని గతంలో సైతం రైల్వే అధికారులకు వినతిపత్రం ద్వారా విన్నవించడం జరిగిందన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సమస్య ఇంకా అలాగే ఉందన్నారు. వెంటనే ఈ ప్రాంతంలో బ్రిడ్జీ, అండర్ బిడ్జ్రీ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. లేదా గోడను తొలగించి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా చూడాలని వినతిపత్రంలో కోరామన్నారు. అధికారులు సానుకూలంగా స్పందించారని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో నోముల రాముయాదవ్, అక్కెం రఘుయాదవ్, బండ రాజేష్యాదవ్, ఎడ్లకాడి, సూర్యం, ఎస్.అశోక్, కవ్వగూడెం, జనార్థన్ తదితరులు పాల్గొన్నారు.