Hyderabad Rains | శేరిలింగంపల్లి, జూన్ 12 : హైదరాబాద్లో గురువారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి శేరిలింగంపల్లిలో పలు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. వరదనీటితో లోతట్టు ప్రాంతాలు నిండిపోయాయి. ప్రధానంగా శేరిలింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి ప్రాంతంలో భారీగా వరద నీరు వచ్చి చేరింది. బ్రిడ్జికి ఇరువైపులా వరద నీరు ముంచెత్తడంతో పూర్తిగా ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పాపిరెడ్డి కాలనీ రాకపోకలు సైతం నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
లింగంపల్లి తారా నగర్ పాపిరెడ్డి కాలనీ ప్రాంతాలు జలమయం కావడంతో స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రహదారులపై నీరు చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ నెలకొంది. లింగంపల్లి మెహదీపట్నం ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. డోయాన్స్ కాలనీ సమీపంలో పెట్రోల్ బంకు, ప్రధాన రహదారిపై మోకాళ్ళ లోతు వరదనీరు చేరడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. లింగంపల్లి వైపు నుంచి గచ్చిబౌలి మాదాపూర్ ఐటీ కారిడార్ లకు వెళ్లే ఐటీ ఉద్యోగులు, వాహనదారులను హైడ్రా అధికారులు ట్రాఫిక్ పోలీసులు దారి మళ్ళించారు.
Hyderabad Rains1
Hyderabad Rains3
Hyderabad Rains4