సిటీబ్యూరో, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): గణనాథుడి దర్శనం కోసం క్యూలైన్లలో నిల్చున్న మహిళా భక్తుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన పోకిరీలు షీటీమ్స్‌కు చిక్కారు. మొత్తం 11 రోజుల్లో 996 మంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని మహిళా భద్రత డీసీపీ కవిత వెల్లడించారు. ఖైరతాబాద్ బడా గణేశ్‌తో పాటు రద్దీగా ఉన్న ఇతర చోట్ల కూడా షీ టీమ్స్ నిఘా పెట్టిందని, పట్టుబడ్డ వారిపై కేసులు నమోదు చేసి వీడియో, ఫొటోగ్రఫీ సాక్షాలతో కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు.
మరికొందరి వీడియో సాక్ష్యాలు సరిగా లేకపోవడంతో అలాంటి వారిని పట్టుకొని వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌనెల్సింగ్ నిర్వహించి హెచ్చరించినట్లు వివరించారు. రౌండ్ ది క్లాక్ షీ టీమ్స్ మహిళా భద్రతపై దృష్టి పెడుతుందన్నారు. మహిళలు వేధింపులకు గురైతే భయపడకుండా షీ టీమ్స్, డయల్ 100కు వెంటనే ఫోన్ చేయాలని సూచించారు.