సిటీబ్యూరో, అక్టోబర్ 7(నమస్తే తెలంగాణ): బాలానగర్‌కు చెందిన యువకుడు ఓ యువతిని ప్రేమించమని తరచూ వేధిస్తూ.. వెంటపడుతున్నాడు. ఫోన్లో మెసేజ్‌లతో బెంబేలెత్తిస్తున్నా డు. విసిగిపోయిన బాధితురాలు సైబరాబాద్ వాట్సాప్ 9490617444కు సమాచారం అందించింది. సైబరాబాద్ షీ టీమ్స్ డీసీపీ అనసూయ ఆ సమాచారాన్ని బాలానగర్ షీ టీమ్స్‌కు పంపించారు. రంగంలోకి దిగిన షీ టీమ్స్ బృందం ముందుగా బాధితురాలితో మాట్లాడింది. ఆమె ఫిర్యాదు ఇచ్చేందుకు సుముఖంగా ఉందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. తన జోలికి రాకుండా చేస్తే చాలని బాధితురాలు చెప్పడంతో వేధిసున్న సదరు యువకుడికి ఫోన్ చేసి.. మాట్లాడిన షీటీమ్స్.‘ నీ మీద ఫిర్యాదు వచ్చింది. మా ముందు హాజరు కావాల’ని సూచించింది.
సరేనన్న ఆ యువకుడు.. లైట్ తీసుకున్నాడు. మళ్లీ షీ టీమ్స్ అతడికి వాట్సాప్‌లో ‘మీరు వచ్చి హాజరవుతారా లేదా మిమ్మల్ని పట్టుకోమంటా’రా అని మెసేజ్ పెట్టారు. అప్పటికీ స్పందించలేదు. దీంతో పోలీసులు అతడి ఫొటోను అతడికే పంపించి ‘నీ ఫొటో దొరికింది నీ అడ్రస్సు, నీ లొకేషన్ మాకు తెలిసిపోతుంద’ని మరో సందేశం పెట్టారు. ఇక అంతే.. ఆ యువకుడు ‘సారీ…సారీ…అమ్మ తోడు ఇంకో సారి అలా చేయను…నన్ను వదిలిపెట్టండి. నా కోసం మా ఇంటికి రాకండి…నేనే వస్తాను’ అని చెప్పి చివరకు షీ టీమ్స్ ముందు హాజరయ్యాడు. మరోసారి తప్పు చేయనని ఒట్టు పెట్టాడు. చివరకు ఆ అమ్మాయికి ఫోన్ చేసి తప్పయిందని, ఇంకోసారి అలా చేయను…క్షమించమని ప్రాధేయపడ్డాడు. మరోసారి తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకోండని బాధితురాలు చెప్పడంతో షీ టీమ్స్ అతడికి కౌన్సెలింగ్ ఇచ్చి వార్నింగ్‌తో వదిలేసింది.