మేడ్చల్, డిసెంబర్7 (నమస్తే తెలంగాణ) : దళితుల అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్వంలో మంజూరైన షీ క్యాబ్ వాహనాలను 23 మంది ఎస్సీ నిరుద్యోగ యువతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో దళితబంధు పథకం ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అనేక సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే మరో పక్క వివిధ వ్యాపారాలు చేసి ఆర్థికంగా దళితులు అభివృద్ధి సాధించేందుకు దళితబంధు పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. షీ క్యాబ్ వాహనం ధర రూ.8 లక్షల 78 వేలు ఉండగా ప్రభుత్వం 5 లక్షల సబ్సిడీని అందజేసినట్లు తెలిపారు.
ప్రతి మహిళ ముఖంలో ఆనందం..
మహిళలు సైతం అన్ని రంగాల్లో పురుషులకు దీటుగా రాణించాలన్నారు. 23 మంది మహిళలకు పైలెట్ ప్రాజెక్ట్ కింద షీ క్యాబ్ వాహనాలను అందజేయడమే కాకుండా వారికి డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చి లైసెన్స్‌లు కూడా అందజేశామని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలాజీ, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి, ఎంపీపీ ఎల్లుబాయి, జడ్పీటీసీ అనిత, పాల్గొన్నారు.
షీ క్యాబ్‌ను నేనే నడిపిస్తా
షీ క్యాబ్‌ను స్వయంగా నేనే నడిపించుకుంటా. ఐటీ కంపెనీ మహిళా ఉద్యోగులను కంపెనీలకు తీసుకెళ్లేందుకు ఒప్పందం కుదుర్చుకున్న. షీ క్యాబ్ ద్వారా నెలకు ఖర్చులు పోను రూ. 30 వేలు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తా.
– జ్యోతి, బోడుప్పల్
ఆర్థికంగా బలపడుతాం
షీ క్యాబ్ వాహనం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధిస్తాననే నమ్మకం ఉంది. తన వాహనాన్ని డీఆర్డీఎ కార్యాలయంలో నడిపించేందుకు ఒప్పందం కుదుర్చుకున్న. ప్రభుత్వం రూ. 5 లక్షల సబ్సిడీ అందించి మిగతా రూపాయలు బ్యాంకు ద్వారా ఇప్పించి తమకు వాహనాన్ని సొంతం చేసిన ప్రభుత్వానికి రుణపడి ఉంటా. కష్టపడి పని చేసి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేరుస్తా. – ఉమ, ఉప్పల్
మహిళల కోసమే వినియోగిస్తా
మహిళల కోసమే షీ క్యాబ్‌ను వినియోగించేలా చూస్తా. సబ్సిడీపై అందించిన షీ క్యాబ్‌ను సద్వినియోగం చేసుకుంటా. నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన షీ క్యాబ్ పథకం తమ కుటుంబాలలో వెలుగులు నింపినట్లయింది. –హేమలత-మేడ్చల్