Shankar Naik | ఉస్మానియా యూనివర్సిటీ : చెడు వ్యసనాలకు అలవాటు పడి వందకు పైగా దొంగతనాలకు పాల్పడిన శంకర్ నాయక్ (32) అనే కరడుగట్టిన దొంగను ఓయూ పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీ కేసులో అరెస్టై జైలుకు వెళ్లి వచ్చిన 15 రోజుల్లో నాలుగు చోరీలు చేసి తన ప్రతిభ చాటుకున్నాడు. గతంలో పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపినా తన తీరు మార్చుకోలేదు. ఓయూ ఏసీపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అడిషనల్ డీసీపీ నరసయ్య, సీఐ రాజేందర్‌తో కలిసి డీసీపీ డాక్టర్ బాలస్వామి వివరాలు వెల్లడించారు.
వారు తెలిపిన వివరాల ప్రకారం నాగర్‌కర్నూల్ జిల్లా వీపనగండ్ల మండలం తూముకుంట గ్రామం నాగర్లబండ తండాకు చెందిన రత్లావత్ శంకర్ నాయక్ గద్వాల్లో బీఫార్మసీ చదువుతుండగా ఓ హత్యాయత్నం కేసులో 2012లో జైలుకు వెళ్లివచ్చాడు. జైలు నుంచి విడుదలైన అనంతరం మద్యం, సిగరెట్లు, గంజాయి వంటి వ్యసనాలకు అలవాటు పడి, రాత్రిళ్లు బయట తిరిగేవాడు. అతడి జల్సాలకు తన సంపాదన సరిపోకపోవడంతో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో చోరీలకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో రాజేశ్ రెడ్డి, రంగారావు, లియాజాఖాన్ తదితర పేర్లతో చలామణి అయ్యాడు. కాలనీలు, వివిధ ప్రాంతాల్లో పగలు తాళం వేసి ఉన్న ఇళ్లను గమనించి, రాత్రి సమయాలలో ఐరన్ రాడ్ సహాయంతో చాకచక్యంగా తలుపు తెరిచి దొంగతనానికి పాల్పడేవాడు.
2022 సెప్టెంబర్‌లో మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి పాల్పడి, పోలీసులకు చిక్కడంతో పీడీ యాక్టు నమోదు చేసి జైలుకు పంపారు. బయటకు వచ్చినా తిరిగి దొంగతనాలు చేస్తూ పోలీసులకు చిక్కడంతో మళ్లీ జైలు పాలయ్యాడు. అలా పలుమార్లు జైలుకు వెళుతూ దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నాడు. ఈ క్రమంలో గత నెలలో జైలు నుంచి విడుదలైన శంకర్ నాయక్ తన వైఖరిని మార్చుకోక 15 రోజుల వ్యవధిలో నాలుగు దొంగతనాలు చేశాడు. వాటిలో ఒకటి ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో కాగా, మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి, పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు చొప్పున ఉండడం గమనార్హం.
ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని హబ్సిగూడలో నివాసముండే రాంజీ తన కుటుంబంతో సహా ఈ నెల 1న మేడ్చల్‌లోని బంధువుల నివాసానికి వెళ్లి, 2న తిరిగివచ్చే సమయానికి ఇళ్లు తాళం తీసి ఉండడంతో పాటు సామాన్లన్నీ చిందరవందరగా పడి ఉండడం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లోని 8 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసు విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు చోరీ జరిగిన విధానం, ఫింగర్ ప్రింట్లు సేకరించి శంకర్ నాయక్ నేరం చేశారని నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో నిందితుడు బుధవారం ఉదయం ఎల్బీనగర్ లో సంచరిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్ తరలించి, విచారించగా తన నేరాలను ఒప్పుకున్నాడు. శంకర్ నాయక్ చోరీ విధానం చూసి పోలీసులు సైతం అవాక్కయయ్యారు.
తాను చోరీ చేసిన ప్రదేశంలో అక్కడ దొంగతనం చేసిన వస్తువుల వివరాలను ఒక చీటీలో రాసి అక్కడ వదిలేవాడు. చీటీ దొరకని పక్షంలో గోడపై వివరాలను రాసేవాడు. అంతేకాకుండా, అన్ని చోరీల వివరాలు, అక్కడ చోరీ చేసిన వస్తువుల వివరాలను డైరీలో ఎప్పటికప్పుడు పొందుపరచడం గమనార్హం. గతంలో ఒక చోరీ చేసిన సమయంలో అక్కడ ఏమీ లభించకపోయినా ఐదు తులాల బంగారు ఆభరణాలు పోయాయని ఇంటి యజమాని ఫిర్యాదు చేయడం, పోలీసులు తన నుంచి రికవరీ చేయడంతో అప్పటి నుంచి ఈ అలవాటు చేసుకున్నానని శంకర్ నాయక్ చెప్పడం విశేషం. అతడి నుంచి 11 తులాల బంగారు ఆభరణాలు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని న్యాయస్థానం ఎదుట హాజరుపరుచనున్నట్లు చెప్పారు. నిందితుడిని పట్టుకున్న డీఎస్సై శ్రీనివాసరావు, ఎస్సై యాసిన్ షరీఫ్, ఏఎస్సై ఈశ్వర్, ఇతర పోలీసులకు డిసిపి అభినందించి రివార్డు అందజేశారు.