సిటీబ్యూరో, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ)ç: లాజిస్టిక్ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. దక్షిణ భారత దేశంతో పాటు ఉత్తర భారత దేశానికి మధ్య ఉన్న మెట్రో నగరంగా హైదరాబాద్ అత్యంత అనుకూలమైన ప్రాంతం కావడంతో లాజిస్టిక్ రంగం వృద్ధికి మరింత అవకాశం ఉంది. ఇప్పటికే హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై బాటసింగారం వద్ద, హైదరాబాద్- నాగార్జునసాగర్ జాతీయ రహదారిపై మంగల్‌పల్లి వద్ద హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో రెండు లాజిస్టిక్ పార్కులను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఏర్పాటు చేశారు. తాజాగా హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై శంషాబాద్ ఔటర్ రింగు రోడ్డు సమీపంలో పెద్ద ఎత్తున మల్టీ మోడల్ లాజిస్టిక్ హబ్‌ను ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీ చర్యలు చేపట్టింది. పట్టణీకరణ శరవేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ కామర్స్, రిటైల్ కార్యకలాపాలు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో సరుకు రవాణా అత్యంత కీలకంగా మారింది. శంషాబాద్ విమానాశ్రయం లోపల అమెజాన్ కంపెనీ పెద్ద గోదాంను ఏర్పాటు చేసింది. ఇప్పటికే శంషాబాద్ చుట్టు పక్కల ఇతర ఆన్లైన్ కంపెనీలకు చెందిన గోదాంలను ఏర్పాటు చేశారు. –
మూడు రవాణా మార్గాలకు కేంద్రం శంషాబాద్
గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న శివారు ప్రాంతాల్లో శంషాబాద్ లాజిస్టిక్‌తో పాటు వివిధ రవాణా మార్గాలకు అనుకూలమైన ప్రాంతంగా ఉంది. ముఖ్యంగా రోడ్డు, రైలు, విమానమార్గాలు శంషాబాద్ కేంద్రంగా ఒకే ప్రదేశం నుంచి ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతంలో మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్టు హబ్‌తో లాజిస్టిక్ హబ్‌ను ఏర్పాటు చేయాలన్న ఆలోచనను ప్రభుత్వం ముందు ఉంచింది. భవిష్యత్ అవసరాలకు సరిపోయేలా సుమారు 300 ఎకరాల్లో మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్టు, లాజిస్టిక్ హబ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి ప్రభుత్వం నుంచి సానుకూలమైన స్పందన రావడంతో హెచ్ఎండీఏ అధికారులు శంషాబాద్ ప్రాంతంలో భూమి లభ్యతపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. ముఖ్యంగా అంతర్జాతీయ విమానాశ్రయంగా శంషాబాద్‌కు మంచి గుర్తింపు రావడంతో పాటు ఇక్కడి నుంచి దేశీయ విమానాలతో పాటు అంతర్జాతీయ విమానాల రాకపోకలు గణనీయంగా పెరిగాయి. ప్రయాణికులతో పాటు సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా విమానాలను నడుపుతున్నారు. రద్దీ పెరగడంతో విమానాశ్రయం విస్తరణ పనులు చేపట్టారు. దీనికి తోడు శంషాబాద్ వద్ద ఔటర్ రింగు రోడ్డు గ్రేటర్ చుట్టూ ఉన్న అన్ని జాతీయ, రాష్ట్ర రహదారులను కలుపుతూ ఉండడం అనుకూలంగా మారింది. ఇక రైల్వే మార్గం కూడా విమానాశ్రయం, ఓఆర్ఆర్, బెంగళూరు జాతీయ రహదారుల మధ్య నుంచి వెళుతుండడంతో ఈ ప్రాంతం మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్టు, లాజిస్టిక్ రంగాలకు సరైన ప్రాంతమని గుర్తించి భూసమీకరణపై దృష్టి సారించారు.
ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో..
శంషాబాద్ ఓఆర్ఆర్ చుట్టు పక్కల భూములను సమీకరించి మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్టు, లాజిస్టిక్ హబ్‌ను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ప్రభుత్వం పరంగా అవసరమైనంత భూమి, మౌలిక వసతులను కల్పిస్తే, ప్రైవేటు సంస్థలు పెట్టుబడులతో ముందుకు వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఇలాంటి విధానమే బాటసింగారం, మంగల్‌పల్లి ప్రాంతాల్లో చేపట్టారు. ప్రభుత్వంపైన భారం లేకుండా, నిర్వహణ విషయంలో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పీపీపీ విధానమే సరైదని హెచ్ఎండీఏ నిర్ణయించింది. సరుకు రవాణా రంగానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంతో ప్రైవేటు సంస్థల నుంచి పెట్టుబడులు రాబట్టవచ్చని, తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుతాయని అధికారులు పేర్కొంటున్నారు. పూర్తి స్థాయిలో కసరత్తు పూర్తయిన తర్వాత ప్రభుత్వం దీనిపై ప్రకటన చేస్తుందని హెచ్ఎండీఏకు చెందిన ఓ అధికారి తెలిపారు.