శంషాబాద్ రూరల్, జూలై 16: ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరుకు గంజాయి తరలిస్తున్న ముఠాను మాదాపూర్ ఎస్ఓటీ, చౌదర్‌గూడ పోలీసులు కలిసి లాల్‌పహాడ్ వద్ద పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.62 లక్షల విలువజేసే 178 కిలోల గంజాయి, రెండు కార్లు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. చిత్తూరు జిల్లా మోతుగూడెం నుంచి గంజాయిని బెంగళూరుకు తరలిస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు.. లాల్‌పహాడ్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. దీంతో వాహనాల్లో గంజాయి తరలిస్తున్న ముఠా పట్టుబడింది. నిందితుల నుంచి 178 కిలోల గంజాయి, రెండు కార్లు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురు నిందితులను విచారించగా.. వారితోపాటు మరో ఐదుగురి పాత్ర ఉన్నట్లు వెల్లడైంది. పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో చత్తీస్‌గఢ్‌కు చెందిన ఇద్దరు డ్రైవర్లు బిద్యాధర్ కీర్తానియా, ప్రశాంత్ బిస్వాస్, ఒడిశాకు చెందిన సిప్రా కాజీ( మహిళ) ఉన్నారు. నిందితుల నేర చరిత్ర ఒడిశాలోని మల్కన్‌గిరికి చెందిన దేపాంకర్ పాత నేరస్థుడు. అతడు గతంలో గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడగా.. ఆర్సీ పురం పోలీసులు కేసు నమోదు చేశారు.
అతడికి చత్తీస్‌గఢ్‌కు చెందిన బిద్యాధర్ కీర్తానియా, ప్రశాంత్ బిస్వాస్‌తో పరిచయం ఉంది. వీరిద్దరూ వేర్వేరు ప్రాంతాల నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తారు. ప్రధాన నిందితుడైన దీంపాకర్ ఆంధ్రప్రదేశ్‌లోని మోతుగూడెం నుంచి బెంగళూరుకు గంజాయి తరలించేందుకు బిద్యాధర్ కీర్తానియా, ప్రశాంత్ బిస్వాస్‌తో ఒప్పందం చేసుకున్నాడు. వీరితోపాటు మరికొందరిని తోడుగా పంపిస్తూ.. ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున ఇచ్చే విధంగా అంగీకారం కుదుర్చుకున్నారు. ఒప్పందం ప్రకారం 14వ తేదీన ఒడిశా నుంచి బయలు దేరిన ఈ ముఠా.. ఆంధ్రప్రదేశ్‌లోని మోతుగూడెంలో గంజాయిని తీసుకొని కార్లలో బయలుదేరారు. ఎవరికీ అనుమానం రాకుండా హైదరాబాద్ శివారుల్లో రెండు కార్లలో ఉన్న గంజాయిని ఒకే కారులోకి మార్చారు. పోలీసుల తనిఖీల్లో మొదట వచ్చిన కారులో కేవలం ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. రెండో కారులో వచ్చిన ముగ్గురు నిందితులతోపాటు గంజాయి పట్టుబడింది. నిందితులను విచారించగా.. జూబేర్, జైనూల్లా, డేటాపిస్, బిశ్వనాథ్ పేర్లు బయటపడ్డాయి. ఈ ఘటనలో ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సమావేశంలో మాదాపూర్ ఎస్ఓటీ టీమ్, షాద్‌నగర్, శంషాబాద్ పోలీసులు, ఎస్ఓటీ డీసీపీ ఎంఏ రషీద్, రామ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.