కొండాపూర్/మియాపూర్, డిసెంబర్ 3 : ఓ వైపు సబ్జెక్ట్ ఒత్తిళ్లు.. మరో వైపు లెక్చలర్ల లైంగిక వేధింపులతో విద్యార్థులు అర్ధంతరంగా తనువులు చాలిస్తున్నప్పటికీ యాజమాన్యాలు కండ్లు తెరవడం లేదు. తమ కళాశాలలో ఏం జరుగుతుందో బయటి వ్యక్తులు వచ్చి ఆందోళనలు చేసే వరకు తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. శ్రీచైతన్య కళాశాలల్లో విద్యార్థినులపై ఉపాధ్యాయుల లైంగిక వేధింపుల ఘటనలు రోజుకు ఒకటి బయటకు వస్తున్నాయి. ఇదే వారంలో మదీనాగూడలోని శ్రీచైతన్య కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించగా, తాజాగా మదీనాగూడలోని భారతి భవన్ శ్రీచైతన్య కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్ శివ విద్యార్థినులతో అసభ్యకరంగా స్నాప్‌చాట్‌లో చాటింగ్ చేసిన ఘటన చోటు చేసుకున్నది.
భారతి భవన్‌లోని శ్రీచైతన్య డే స్కాలర్ కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న శివ కొంత కాలంగా విద్యార్థినులకు స్నాప్‌చాట్‌లో రిక్వెస్ట్‌లు పంపిస్తూ, అసభ్యకరంగా మెసేజ్‌లు పంపిస్తున్నట్లు విద్యార్థినులు తెలిపారు. చాటింగ్‌కు సంబంధించిన స్క్రీన్షాట్లను సైతం కళాశాల యాజమాన్యంతో పాటు తల్లిదండ్రులకు అందించారు. ఇదిలా ఉండగా.. శివ మెసెజ్‌లకు రిఫ్లై ఇవ్వకపోతే విద్యార్థినులను అంత బిజీగా ఉన్నావా అంటూ అడిగి ఇబ్బందులకు గురి చేసేవాడని బాధితులు తెలిపారు. విద్యార్థినులకు ఎదురవుతున్న ఇబ్బందులపై తల్లిదండ్రులతో కలిసి యాజమాన్యానికి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేదంటూ వాపోతున్నారు.
విషయం విద్యార్థి సంఘాలకు తెలియడంతో మంగళవారం పలు విద్యా ర్థి సంఘాలు కళాశాల వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టాయి. వైస్ ప్రిన్సిపాల్ శివను వెంటనే ఉద్యోగంలో నుంచి తీసివేసి, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనకు దిగారు. ఇదిలా ఉండగా శివను 5 రోజుల క్రితమే వైస్ ప్రిన్సిపాల్ విధుల నుంచి తొలగించామని చెబుతుండగా, నిన్నటి వరకు శివ కాలేజీకి వచ్చాడంటూ విద్యార్థులు తెలిపారు. కళాశాల ఎదుట జరుగుతున్న ఆందోళన సమాచారాన్ని అందుకున్న మియాపూర్ పోలీసులు అక్కడికి చేరుకుని జరిగిన విషయాన్ని తెలుసుకుని, వైస్ ప్రిన్సిపాల్ వేధింపులపై విద్యార్థినులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. విద్యార్థి సంఘాలు, విద్యార్థినుల స్టేట్మెంట్తో పోలీసులు ఫిర్యాదును స్వీకరించారు.