మల్కాజిగిరి, జూలై 15: వివాహితపై లైంగికదాడి చేసి తప్పించుకు తిరుగుతున్న నిందితుల కోసం అల్వాల్ పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. యాప్రాల్‌లో ఓ మహిళ శుక్రవారం సాయంత్రం ఉబెర్ ఆటోను బుక్ చేసింది. అక్కడి నుంచి అల్వాల్‌కు వచ్చింది. పని ముగించుకొని అదే ఆటోలో తిరిగి ప్రయాణమైంది. అయితే, ఆటో డ్రైవర్ ఆ మహిళను మభ్యపెట్టి వివిధ కాలనీల చుట్టూ తిప్పుతూ.. స్థానికంగా ఉన్న ఓ వైన్ షాపు వద్ద ఆటో ఆపాడు. దీంతో ఆ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. డ్రైవర్ అక్కడున్న ఇద్దరిని ఆటోలో ఎక్కించుకున్నాడు. వారు మద్యం తాగుతుండగా మహిళకు అనుమానం వచ్చి అభ్యంతరం చెప్పింది. అయినా.. వినకుండా ఆటోలో అల్వాల్‌లోని వెంకట్రావు లైన్‌లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడ ఆమెను బెదిరించి అక్కడున్న కారులోకి ఎక్కించారు.
ఆటో డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కారులో ఆ ఇద్దరు కలిసి మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారు. శనివారం తెల్లావారుజామున ఇద్దరి నుంచి తప్పించుకున్న బాధిత మహిళ రోడ్డుపైకి వచ్చింది. అదే సమయంలో వచ్చిన ఓ ఆటో డ్రైవర్ సహాయంతో సమీపంలోని గణేశ్ ఆలయం వద్దకు వచ్చి 100 నంబర్‌కు కాల్చేసి, విషయాన్ని పోలీసులకు వివరించింది. వెంటనే బొల్లారం పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి, బాధిత మహిళను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొనివెళ్లారు. అక్కడ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రావడంతో కేసును అల్వాల్ పీఎస్‌కు బదిలీ చేశారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాహుల్ దేవ్‌ను సంప్రదించగా.. కేసు దర్యాప్తులో ఉన్నదని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు.