బీఎన్ఆర్ హిల్స్ సొసైటీలోని ఇండ్ల నుంచి వచ్చే మురుగును రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌ను ఆనుకొని పైపు ద్వారా బయటకు వదులుతున్నారు. గృహ వ్యర్థాలను బయటకు వదిలేందుకు ఓ పైపును ఏర్పాటు చేసి..మురుగునంతా ఏండ్ల తరబడి పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలంలోకి వదిలారు. పైపును రోడ్డు పక్కనే ఏర్పాటు చేయడం వల్ల ఓ చోట ఫుట్‌పాత్ ప్రాంతం ధ్వంసమై మొన్నటి దాకా రోడ్డుపై పారింది. నేరుగా వంపులో ఉన్న ఓల్డ్ ముంబై హైవేపైకి చేరింది.
అక్కడి నుంచి దర్గా దాకా రోడ్డంతా మురుగుతో నిండిపోవడంతో ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయి. దీంతో ‘రోడ్డెక్కిన మురుగు’ పేరిట ‘నమస్తే’ కథనం ప్రచురించింది. గుట్టుచప్పుడు కాకుండా రోడ్డుపై పారుతున్న మురుగును మళ్లించి కాలువ ద్వారా మళ్లీ ప్రభుత్వ స్థలంలోకి వదులుతున్నారు. మురుగు నీటిని బహిరంగ ప్రదేశాల్లోకి రాకుండా ఆపాల్సింది పోయి.. ఏకంగా ప్రభుత్వ స్థలంలోకే యథేచ్ఛగా వదులుతున్నారు. జలమండలి అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.
-సిటీబ్యూరో