ఖైరతాబాద్, జూన్ 21 : ఖైరతాబాద్‌లోని ఇందిరానగర్‌కాలనీలో కొత్త డ్రైనేజీ పైపులైన్ వేశారు. ఈ క్రమంలో తాగునీటి పైపులైన్లు దెబ్బతిన్నాయి. హడావుడిగా పనులు ముగించి, పగిలిపోయిన పైపులైన్లకు నిర్లక్ష్యంగా ప్యాచ్‌లు వేసి మూసివేశారు. ఫలితంగా తాగునీటిలో డ్రైనేజీ నీరు కలుస్తున్నది. దీంతో దుర్వాసనతో కూడిన మురుగునీరు సరఫరా అవుతున్నది. ఈ విషయమై బస్తీవాసులు అనేకసార్లు జలమండలికి ఫిర్యాదు చేశారు. అయితే అధికారులు.. ఫిర్యాదు నమోదైన కొద్ది గంటలకు ‘సమస్య పరిష్కరించబడింది’ అంటూ సందేశాలు పంపిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. వాస్తవ పరిస్థితులను పరిశీలించకుండా..బాధ్యాతారాహిత్యంగా వ్యవహరిస్తున్న జలమండలిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.