Meerpet Murder Case | సిటీబ్యూరో/బడంగ్‌పేట, ఫిబ్రవరి 9(నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ మీర్‌పేటలో భార్యను చంపి ముక్కలు ముక్కలు చేసిన గురుమూర్తి కేసుకు సంబంధించి సంచలనాత్మక విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడు గురుమూర్తిని పోలీసులు విచారిస్తున్నారు. వెంకటమాధవి హత్య కేసులో నిందితుడైన ఆమె భర్త గురుమూర్తి రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 25మంది సాక్షులను పోలీసులు విచారించారు. మాధవి, గురుమూర్తి సొంతూరులో కూడా కొందరిని వీరిద్దరి గురించి అడిగారు. జిల్లెలగూడలో చుట్టుపక్కల వారి నుంచి వివరాలు సేకరించారు.
ఈ రిమాండ్ రిపోర్టులో వారి ఇద్దరికి ఉన్న విభేదాల గురించి స్పష్టంగా ప్రస్తావించారు. మాధవిని గురుమూర్తి ఒక్కడే హత్య చేయలేదని, గురుమూర్తి తల్లి లక్ష్మమ్మ, చెల్లెలు సుజాత, తమ్ముడు కిరణ్‌లు సహకరించారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఏ-1గా గురుమూర్తి, ఏ-2గా సుజాత, ఏ-3గా పుట్ట సుబ్బలక్ష్మమ్మ, ఏ-4గా పుట్ట కిరణ్‌లుగా వీరి పేర్లను చేర్చారు. గురుమూర్తి పోలీస్ కస్టడీలో ఉండగా, పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. సాక్ష్యాలు మాయం చేసేందుకు వారు ప్రయత్నించారని, ముగ్గురిపై అభియోగం నమోదైంది. మరోవైపు కోర్టులో తన వాదన తానే వినిపించుకుంటానని గురుమూర్తి పోలీసులకు చెప్పినట్లు సమాచారం. మరింత సమాచారం కోసం గురుమూర్తికి పాలీగ్రాఫ్ టెస్టులు కూడా చేయించాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రిపోర్టులో పేర్కొన్న అంశాలివే..!
గురుమూర్తి ఆర్మీలో పనిచేసి ప్రస్తుతం డీఆర్డీఓలో సెక్యూరిటీగా పని చేస్తున్నారు. ఆర్మీలో రిటైైర్డెన తర్వాత జిల్లెలగూడలో నివాసముంటున్నారు. భార్యాభర్తలిద్దరిదీ ఒకే ఊరు. ఐదేళ్ల కిందట గురుమూర్తి కుటుంబానికి, మాధవి కుటుంబానికి మధ్య పెద్దఎత్తున గొడవలు జరిగి పెద్ద మనుషుల మధ్య పంచాయితీ పెట్టుకున్నారు. ఆ తర్వాత గురుమూర్తి అత్తగారింటికి వెళ్లలేదు.. భార్యను వెళ్లనివ్వలేదు. అయితే జనవరిలో సంక్రాంతి సందర్భంగా ఎప్పుడూ గురుమూర్తి ఇంటికే కాకుండా ఈసారి తన పుట్టింటికి తీసుకెళ్లాలంటూ మాధవి పట్టుబట్టింది. ప్రతీసారి ఏ పండుగ వచ్చినా గురుమూర్తి దంపతులు తమ ఇంటికే వెళ్తుండేవారు. పుట్టింటికి పోతానంటూ మాధవి గొడవ పడుతుండటంతో ఆమెను ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని గురుమూర్తి భావించాడు. పక్కాప్లాన్‌తో పిల్లలను జనవరి 15వ తేదీన తన చెల్లెలి ఇంటి వద్ద వదిలేసి భార్యని ఇంటికి తీసుకొచ్చాడు.
ఈసారి తన పుట్టింటికి తీసుకెళ్లమని అడిగింది. అదే విషయంపై జనవరి 16న ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ కోపంతో ఆమెను గోడకేసి కొట్టి గొంతు నులిమి హత్య చేశాడని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. చనిపోయినట్లు ఆధారాలు లభించకుంటే నమ్ముతారని భావించిన గురుమూర్తి చనిపోయిన మాధవి మృతదేహాన్ని ముక్కలుగా మొత్తం 70 భాగాలుగా నరికేశాడు. కుక్కర్లో పెట్టి ఉడికించాడు. మాంసం ఒక బకెట్లో వేసి పెద్ద చెరువులో పడేశాడు. ఆ తర్వాత మీ అమ్మాయి కనిపించడం లేదంటూ గురుమూర్తి మాధవి తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. మాధవి తల్లి మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత సీసీ ఫుటేజ్‌లో మాధవి, గురుమూర్తి కదలికలను గమనించిన పోలీసులు అనుమానంతో గురుమూర్తిని విచారించారు.
అదే సమయంలో మీ అమ్మాయిని నేనే చంపానంటూ గురుమూర్తి మాధవి తండ్రికి చెప్పారు. దీంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా హత్య చేసిన విధానాన్ని చెప్పారు. పోలీసులు పది రోజుల పాటు మృత దేహం కోసం పెద్ద చెరువులో వెతికించారు. చివరకు మాంసం పడేసిన బకెట్ వారికి లభ్యమైంది. ఇంటి చుట్టుపక్కల వారి సాక్ష్యాలు సేకరించగా హత్య జరిగిన మరుసటిరోజు గురుమూర్తి ఇంటినుంచి కమురు వాసన వచ్చిందని, ఇదేంటని అడిగితే మాంసం వండుతున్నానని చెప్పారని పెంట్‌హౌజ్‌లో ఉండే మహిళ చెప్పింది. నిందితుని ఇంటి నుంచి కత్తి, రంపం, స్టవ్, పినాయిల్ సీసాలు, ఖాళీ పెయింట్బకెట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.