సిటీబ్యూరో/బంజారాహిల్స్, నవంబరు 21 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీ పరిధిలో ట్రేడ్ లైసెన్స్, ఆస్తిపన్ను చెల్లింపుల్లో తవ్వుతున్న కొద్ది అక్రమాలు బయటకొస్తున్నాయి. రూ.కోట్లలో వ్యాపారం చేస్తూ ట్యాక్స్ చెల్లింపులు మాత్రం రూ.లక్షల్లో జరుపుతున్నారు. జీహెచ్ఎంసీ ఖజానాకు గండికొడుతున్న జాబితాలో తాజాగా రామానాయుడు, అన్నపూర్ణ స్టూడియో నిర్వాహకుల భాగోతం వెలుగులోకి వచ్చింది. స్టూడియోల కమర్షియల్ విస్తీర్ణం తక్కువ చూపిస్తూ భారీగా ట్రేడ్ లైసెన్స్ చార్జీలను తక్కువగా రికార్డుల్లోకి ఎక్కించి అతి తక్కువ ఫీజును వర్తింపజేస్తున్నట్లు గుర్తించారు.
అన్నపూర్ణ స్టూడియోస్ విస్తీర్ణాన్ని పరిశీలించగా 1.92లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యాపారం చేస్తుండగా కేవలం 8100 చదరపు అడుగులకు మాత్రమే అంటే రూ.49వేలు మాత్రమే ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లిస్తున్నారని తేల్చారు.. దీంతో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వాహకులు ట్రేడ్ లైసెన్స్ ఫీజుగా రూ.11.52లక్షలు చెల్లించాలంటూ సర్కిల్-18 అధికారులు నోటీసులు జారీ చేశారు.
దీంతో పాటు జూబ్లీహిల్స్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో 68,270 చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యాపారం చేస్తుండగా కేవలం 1900 చదరపు అడుగుల విస్తీర్ణంలోనే వ్యాపారం చేస్తున్నామంటూ ఏటా రూ.7600 ట్రేడ్ లైసెన్స్ ఫీజుగా చెల్లిస్తున్నారని తేలింది. దీంతో రూ. 2.73 లక్షల ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలంటూ రామానాయుడు స్టూడియోస్ నిర్వాహకులైన సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థకు నోటీసులు అందజేశారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజులను మదింపు వేయాల్సిన జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో భారీ మొత్తంలో బల్దియా ఖజానాకు గండిపడుతున్నది.
ఈ రెండు సంస్థలతో పాటు సర్కిల్-18 పరిధిలోని వందలాది సంస్థల్లో సైతం ఇదే రీతిలో అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తుండడంతో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించడం గమనార్హం. కాగా జీహెచ్ఎంసీ ఖజానాకు ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్‌ల రూపంలో రావాల్సిన నిధులు భవన యాజమానులకు ఆదా కావడం, ట్యాక్స్ సిబ్బంది జేబుల్లోకి వెళ్లడం వంటి వ్యవహారాలు వరుసగా వెలుగులోకి వస్తున్నా..అందుకు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు మౌనంగా ఉండడం తీవ్ర విమర్శలు తావిస్తున్నది.
లోపాలకు అడ్డు పడేదెన్నడూ?
ఏఎంఓహెచ్‌లు, ఎస్ఎఫ్ఏలు, జవాన్ల చేతుల్లో నుంచి తొలగించి ఏఎంసీలు, బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లకు ట్రేడ్ లైసెన్స్‌ల బాధ్యతలు అప్పగించగా..ఇందులో కొందరు అక్రమాలకు తెరలేపారు. లైసెన్స్‌లు లేని వ్యాపారుల నుంచి అందినంత దండుకోవడం, ట్రేడ్ లైసెన్స్‌లు ఇప్పిస్తామని రూ. 10వేలు అయ్యే చోట సదరు వ్యాపారస్తుడి నుంచి రూ. 60వేలు వసూలు చేస్తున్నారు. ఇటీవల జూబ్లీహిల్స్‌లో ట్యాక్స్ సిబ్బంది ఈ అంశాలపైనే ఏసీబీకి చిక్కడం గమనార్హం. అంతేకాకుండా కొన్ని చోట్ల ఫీజు వసూళ్లలో చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. జీహెచ్ఎంసీ వచ్చే ఆదాయాన్ని పక్కదారి పట్టించి ఖజానాకు గండి కొడుతున్నారు.
వాస్తవంగా 20 ఫీట్ల మేర సింగిల్ లేన్ రోడ్డు ఉంటే చదరపు మీటర్‌కు రూ.3లు, డబుల్ లేన్ రోడ్డు ఉంటే 20 నుంచి 30 ఫీట్ల మేర ఉన్న రోడ్లపై చదరపు ఫీట్‌కు రూ. 4, రెండు లేన్ల కంటే ఎక్కువగా ఉండి 30 ఫీట్లకు మంచిన రోడ్లపై చదరపు మీటర్‌కు రూ. 6ల ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు గ్రీనరీ చార్జీలు కూడా చెల్లించాలి. సంబంధిత వ్యాపారి నేరుగా ఆన్లైన్లో ఈ ఫీజు చెల్లించే వీలు ఉంటుంది. కానీ సర్కిల్లోని ఎస్ఏఫ్ఏలు వ్యాపారస్తుల వద్దకు వెళ్లి బేరసారాలు అడుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఉదాహరణకు రూ. లక్ష ఇచ్చే వారి దగ్గర రూ. 50వేల వరకు తీసుకుని వదిలేస్తున్నారు. సదరు వ్యాపారస్తుడి నుంచి వచ్చిన ఫీజు బల్దియా ఖజానాకు చేరడం లేదన్న ఆరోపణలు లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలో ఒకే చోట తిష్ట వేసిన వారి పై ఆరోపణలు ఉన్న వారిని, సంస్థగత లోపాలను సరిదిద్ది ట్రేడ్ లైసెన్స్‌లను గాడిన పెట్టాల్సిన చోట హడావుడి చర్యలకే పరిమితం అవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఫలితంగానే ట్రేడ్ లైసెన్స్ వసూళ్లు ప్రతి ఏటా గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయన్న చర్చ జరుగుతున్నది.