కుత్బుల్లాపూర్,మార్చి17: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా గృహ అవసరాలకు వాడే (Domestic) గ్యాస్ సిలిండర్లను వ్యాపార అవసరాలకు వాడుతున్న వారిపై పౌరసరఫరాల శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం 10 కేసులు నమోదు చేసి, 38 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్ ఏఎస్ఓ (ASO) కళ్యాణ్, ఇన్స్పెక్టర్లు శ్రవణ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, కార్తీక్, మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారి శృతి నేతృత్వంలోని బృందం మంగళవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని షాపూర్ నగర్, సూరారం, చింతల్, సూరారం గుట్ట, గాజులరామారం పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు.
ప్రధానంగా రోడ్డు పక్కన ఉండే టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, స్ట్రీట్ సైడ్ వెండర్స్ కమర్షియల్ సిలిండర్లకు బదులుగా తక్కువ ధరకు వచ్చే డొమెస్టిక్ సిలిండర్లను వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. తనిఖీల్లో భాగంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 10 కేసులు నమోదు చేసి, మొత్తం 38 సిలిండర్లను సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా గృహ అవసరాల సిలిండర్లను వ్యాపారాలకు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని, తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.