GHMC | సిటీబ్యూరో, జూన్ 24 (నమస్తే తెలంగాణ ): శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్‌పై తీవ్ర ఆరోపణలు వస్తే ..ఏకంగా నలుగురు మంత్రులు స్పందించారు. తమరికి దగ్గరి బంధువు, కావాల్సిన వ్యక్తి అని ఉమ్మడి వరంగల్, నల్గొండ మంత్రులు చెప్పడంతో తొలగింపు ప్రక్రియ నిలిచిపోయింది. ఈ అంశం ఉద్యోగుల్లో విస్తృతంగా చర్చ జరిగింది. ఇదే జోన్లో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు వెళ్లిన అధికారులపై ప్రభుత్వ పెద్దలు ఆ నిర్మాణం జోలికి వెళ్లొద్దని ఒత్తిళ్లు రావడంతో సదరు గచ్చిబౌలి డివిజన్లో ఉన్న నిర్మాణం జోలికి వెళ్లలేదు.. పైగా సదరు బిల్డర్ జోనల్ ముఖ్య అధికారి ఒకరికి ఆఫర్ ఇచ్చినా సున్నితంగా తిరస్కరించారు.
ఎన్నో అక్రమ నిర్మాణాలు, ఓసీ (ఆక్యూపెన్సీ సర్టిఫికెట్) విడుదలలో కఠినంగా జోనల్ అధికారులు వ్యవహరించారు. గతంలో కంటే భిన్నంగా దాదాపు ఏడాదిలో ఈ జోనల్ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలకు దూరంగా సేవలు అందుతున్నాయన్న బలమైన చర్చ. కానీ ఒక్కసారిగా శేరిలింగంపల్లి జోనల్ బదిలీల్లో మార్పులు వచ్చాయి. కీలకమైన స్థానాల్లో ఉన్న ఐఏఎస్‌లు సంస్థను ఒక దారికి తీసుకువచ్చి మరింత చక్కదిద్దే సమయంలోనే బదిలీలు చేయడం పట్ల ఉద్యోగ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అవినీతి, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని అందలం ఎక్కిస్తూ పోస్టింగ్ ఇవ్వడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రధాన కార్యాలయంలో పోస్టింగ్ అంటే ఇష్టపడని సదరు అధికారి పనితీరుపై ఇటీవల కాలంలో మేయర్, కౌన్సిల్ సభ్యులు, సమీక్షల్లో మంత్రి సైతం హెచ్చరించిన కీలక స్థానాన్ని దక్కించుకోవడం వెనుక మతలబు ఏం జరిగిందన్న చర్చ విస్తృతంగా జరుగుతున్నది. సదరు అధికారికి నల్గొండ జిల్లా మంత్రి అండదండలు ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద కూల్చివేత ఘటనలోనూ ఓ మంత్రి చెప్పాడని ముందుకు వెళ్లిన ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ఐఏఎస్ అధికారి హేమంత్ బోర్కడేపై బదిలీ వేటు పడింది. వరుసగా జరుగుతున్న పరిణామాలతో బల్దియాలో పని చేయాలంటే సవాల్‌గా మారిందని ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో తాజాగా జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో ఒక అంశం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా ఉన్న ఆమ్రపాలి నాలుగు పదవుల్లో కొనసాగడం పట్ల పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. జీహెచ్ఎంసీ కమిషనర్ పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూనే, అందుకు మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఆర్డీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్‌గా, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ఔటర్ రింగు రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఆమ్రపాలి విధులు నిర్వహించనున్నారు. దీంతో ఒకేసారి ఆమెకు నాలుగు పదవులా అంటూ పలువురు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.