సిటీబ్యూరో, జనవరి 18 (నమస్తే తెలంగాణ): నిర్మానుష్యంగా ఉండే రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో తిరిగే స్నేహితులు, ప్రేమికులను బెదిరించి అమ్మాయిలు, మైనర్ బాలికలపై లైంగిక దాడులకు పాల్పడిన సిపాయి, సీరియల్ రేపిస్ట్‌కు 20 ఏండ్ల జైలు శిక్షతో పాటు రూ. 2 లక్షల జరిమానా విధిస్తూ హాకా భవన్‌లోని బాలల కోర్టు స్పెషల్ జడ్జి జె.కవిత తీర్పు వెల్లడించారని సీసీఎస్ జాయింట్ సీపీ గజారావు భూపాల్ వెల్లడించారు. జాయింట్ సీపీ కథనం ప్రకారం.. బీహార్‌కు చెందిన బ్రిజేశ్ యాదవ్ ఆర్మీలో సిపాయిగా పనిచేశాడు. అమ్మూగూడ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉండే నిర్మానుష్య ప్రాంతాల్లో తిరిగే వారిని టార్గెట్ చేశాడు.
ఆ ప్రాంతాలకు వచ్చే అమ్మాయిలు, అబ్బాయిలను చితకబాది, అమ్మాయిలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ ప్రాంతంలో ఏరియా పెట్రోలింగ్ చేస్తున్నానంటూ బాధితులను బెదిరించి దాడులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే 2017లో 15 ఏండ్ల బాలిక, స్నేహితుడితో కలిసి అక్కడికి వెళ్లగా.. ఆమె స్నేహితుడిని చితకబాదాడు. ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడి పరారయ్యాడు. ఈ కేసులో నిందితుడిని పట్టుకోవడంలో పోలీసులకు సరైన ఆధారాలు లేకపోవడంతో స్థానిక తిరుమలగిరి పోలీసులు ఆ ప్రాంతంలో నిఘాను పెంచారు.
ఈ ఘటనపై పోక్సో చట్టంతో పాటు లైంగిక దాడి సెక్షన్లపై కేసు నమోదు చేసిన తిరుమలగిరి పోలీసులు.. బాధితురాలిని భరోసా కేంద్రానికి పంపించారు. భరోసా ఆధ్వర్యంలో బాధితురాలికి తగిన సహకారం అందించారు. 2018లో కూడా అదే ప్రాంతంలో మరో బాలికపై లైంగిక దాడికి యత్నం జరిగింది. ఈ కేసులో బాలిక స్నేహితుడిపై దాడి చేసిన సిపాయి పరారయ్యాడు. ఈ కేసును పోలీసులు చాలెంజ్‌గా తీసుకున్నారు. ఘటన స్థలంలో లభించిన ఆధారాలను ఎఫ్ఎస్ఎల్కు పంపించారు. అలాగే, 2017లో సేకరించిన ఆధారాలు, 2018 ఘటనతో పోల్చి చూశారు. దీంతో నిందితుడికి సంబంధించిన ఆధారాలు ఒకే రకంగా ఉన్నాయి.
నిందితుడు ఒకడేనని నిర్ధారణకు వచ్చారు. సాంకేతిక పరమైన ఆధారాలు సేకరించి, వాటి ద్వారా బ్రిజేశ్ కుమార్ యాదవ్ నిందితుడిగా నిర్ధారించారు. ఆ తర్వాత అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో సేకరించిన ఆధారాలతో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. దీంతో 2017, 2018లో జరిగిన రెండు ఘటనల్లో న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్షతో పాటు జరిమానాను విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఈ కేసులో భరోసా సిబ్బంది బాధితులకు అండగా నిలిచి, తిరుమలగిరి పోలీసుల సహకారంతో కోర్టుకు కావాల్సిన అన్ని సాక్ష్యాలను సమర్పించింది. పక్కా ఆధారాలతో నిందితుడికి శిక్ష పడేలా చేశారంటూ.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఈ సందర్భంగా భరోసా అధికారులు, సిబ్బందిని అభినందించారు.