సిటీబ్యూరో/మారేడ్‌పల్లి, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసు కస్టడీలో భాగంగా రెండోరోజైన శనివారం డాక్టర్ నమ్రతను పోలీసులు పలు విషయాలపై ప్రశ్నించారు. తమ దగ్గర ఉన్న కొన్ని కేస్ స్టడీస్‌ను చూపించి.. వాటి విషయంలో ఆమె పాత్రపై ప్రశ్నించారు.
అయితే తాను గర్భిణుల కోసం ఫ్రీ మెడికల్ క్యాంపులు చేపట్టాను తప్ప.. ఎక్కడా తప్పు చేయలేదని చెప్పినట్లు తెలిసింది. తమ కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు ముఖ్య నేతలు, అధికారులు వచ్చేవారని, వారు కూడా తమ సర్వీసులను మెచ్చుకున్నట్లు చెప్పినట్లు తెలిసింది.
అందులో ఇద్దరు అధికారుల విషయంలో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నప్పటికీ పోలీసులు మాత్రం వారి పేర్లను ధ్రువీకరించలేదు. మొదటిరోజు డాక్టర్ నమ్రత కస్టడీ విచారణలో చాలా విషయాలపై పోలీసులు అడిగిన ప్రశ్నలకు నమ్రత నోరుమెదపకపోగా.. రెండోరోజు కొంత సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. డాక్టర్ నమ్రతకు తెలుగు రాష్ర్టాల్లోనే కాకుండా మరో నాలుగు రాష్ర్టాల్లో నెట్వర్క్ ఉందని హైదరాబాద్ పోలీసులు చెప్పారు.
ఫ్రీ మెడికల్ క్యాంపులతో ఎర..!
సృష్టి టెస్ట్‌ట్యూబ్ సెంటర్ పేరుతో పేదింటి ఆడబిడ్డలకు ఉచితంగా ఫెర్టిలిటీ సేవలు చేస్తామంటూ.. గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఏపీలోని గ్రామీణ ప్రాంతాలే టార్గెట్‌గా క్యాంపులు నిర్వహించిన నమ్రత.. పేద మహిళలను అవసరాలను గుర్తించింది. ఆర్థికంగా ఆదుకుంటామంటూ.. ఏజెంట్ల ద్వారా ట్రాప్ చేసిన ఆ తర్వాత వారు పిల్లలను ప్రసవించిన వెంటనే డబ్బులు ఇస్తామని ఎరవేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
విశాఖపట్నం, విజయవాడ కేంద్రాలుగా డెలివరీలు చేసినట్లు, డెలివరీ అయిన తర్వాత డాక్టర్ నమ్రత బృందం నవజాత శిశువును తీసుకుని తల్లికి డబ్బులు ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ నవజాత శిశువులను తీసుకొచ్చి చైల్డ్ట్రాఫికింగ్కు పాల్పడడమే కాకుండా సరోగసి ద్వారా అద్దె గర్భంలో పుట్టిందంటూ.. బాధిత దంపతులకు ఇస్తున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. అక్రమంగా సంపాదించిన డబ్బులతో హైదరాబాద్, ఏపీలో ఫామ్‌హౌస్, మియాపూర్, కూకట్పల్లి, సికింద్రాబాద్, యూసఫ్‌గూడతో పాటు పలుచోట్ల భవన సముదాయాలు కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది.
మహిళలే ఏజెంట్లు..
ఆయా రాష్ర్టాల్లో కూడా మహిళలే ఏజెంట్లుగా పనిచేస్తున్నారని, క్యాంపులకు వచ్చిన దంపతులకు ఐవీఎఫ్ ద్వారా పిల్లలు కలుగుతారంటూ డాక్టర్ నమ్రత నమ్మబలికారని తెలిపారు. అనంతరం తన వద్దకు వచ్చిన దంపతులను ఐవీఎఫ్ బదులు సరోగసీకి రెఫర్ చేశారని పోలీసులు చెప్పారు. దంపతుల నుంచి రూ.30 నుంచి రూ.50లక్షలు వసూలు చేశారని వెల్లడించారు. పిల్లలు కొనుగోలు చేసి సరోగసీ ద్వారా పుట్టారంటూ.. దంపతులకు అప్పగించి నమ్రత మోసం చేశారని పోలీసులు తెలిపారు. ఏఎన్ఎం, ఆశా వర్కర్లను ఏజెంట్లుగా నియమించుకుని వారి ద్వారా చైల్డ్ ట్రాఫికింగ్‌కు నమ్రత చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు.
వారే కీలకం..!
సృష్టి సెంటర్ కేసులో ఏ3 కల్యాణి, ఏ6 సంతోషి స్టేట్మెంట్లు కీలకంగా మారనున్నాయి. కోర్టు అనుమతితో సృష్టి కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న కల్యాణి , ధనశ్రీ సంతోషిలను గోపాలపురం పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. గాంధీ ఆసుపత్రిలో వైద్యసేవల అనంతరం వారిని నార్త్‌జోన్ డీసీపీ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు. చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడిన నమ్రత వ్యవహారంలో నవజాత శిశువులను తీసుకురావడంతో కల్యాణి, సంతోషిలే కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. సృష్టి టెస్ట్‌ట్యూబ్ సెంటర్ కేసులో తాజాగా మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో మహిళలు కూడా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య 11కు చేరింది. రెండు తెలుగు రాష్ర్టాల్లో మహిళలే ఏజెంట్లుగా డాక్టర్ నమ్రత ఈ వ్యవహారం కొనసాగించారు. శిశువుల విక్రయాల్లో న మ్రత తన ఏజెంట్లకు నజరానాలు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో బయటపడింది.