LB Nagar Murder Case | ఎల్బీనగర్లోని ఆర్టీసీ కాలనీలో ప్రేమోన్మాది దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రేమను నిరాకరించిందన్న కోపంతో ఆదివారం మధ్యాహ్నం యువతి ఇంటికి వెళ్లి ఆమెపై, అడ్డొచ్చిన తమ్ముడిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో యువతి తమ్ముడు చింటు మరణించగా.. యువతి ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. అయితే ఇంతటి అఘాయిత్యానికి తెగబడ్డ నిందితుడు శివకుమార్ నేర చరిత్రపై ఇప్పుడు పలు కథనాలు వినిపిస్తున్నాయి. నిందితుడు శివ మొదట్నుంచి కోపిష్టి అని.. ఆవేశంలో కన్నతండ్రిని కూడా దారుణంగా హత్య చేశాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కత్తులు, తుపాకులతో శివ చేసిన రీల్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. వీటితో పాటు అమ్మాయిలతో చేసిన డ్యాన్సులు, జల్సాల వీడియోలు కూడా బయటకొచ్చాయి.
శివ స్వస్థలం రంగారెడ్డి జిల్లా నేరెళ్లచెరువు గ్రామం. డిగ్రీ వరకు చదువుకున్న శివకుమార్.. సినిమా అవకాశాల కోసమని హైదరాబాద్ వచ్చాడు. సిటీలో కొన్నాళ్లు ఖాళీగా తిరిగాడు. పనిపాట లేకుండా శివ ఖాళీగా తిరుగుతుండటంతో ఇంట్లో గొడవలకు దారి తీసింది. ఇదే విషయమై మూడేండ్ల క్రితం శివను వాళ్ల నాన్న గట్టిగా మందలించాడు. దీంతో తండ్రిపై శివ ఆగ్రహంతో ఊగిపోయాడు. కన్నతండ్రి అన్న విచక్షణ కోల్పోయి సుత్తితో తలపై బలంగా కొట్టి చంపేశాడని నేరేళ్లచెరువు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే ఆ కుటుంబంలో ఒక్కడే మగ పిల్లాడు కావడంతో.. వాళ్ల కుటుంబం రోడ్డున పడకూడదనే ఉద్దేశంతో గ్రామ పెద్దలు ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. అందుకే తండ్రి హత్యను సహజ మరణంగా చిత్రీకరించారని గుర్తు చేసుకుంటున్నారు. కాగా, శివకుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతని నేర చరిత్రపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే శివకు సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కత్తులు, తుపాకులు పట్టుకొని దిగిన ఫొటోలు, చేసిన వీడియోలు బయటకొచ్చాయి. వీటితోపాటు అమ్మాయిలతో డ్యాన్సులు, జల్సాలు చేసిన వీడియోలు కూడా వైరల్‌గా మారాయి.
ప్రేమోన్మాది శివ దాడిలో గాయపడ్డ సంఘవి స్వస్థలం రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం. సంఘవి, శివ ఇద్దరూ పదో తరగతి వరకు షాద్‌నగర్‌లో కలిసి చదువుకున్నారు. అప్పట్నుంచే శివ తనను ప్రేమించాలని సంఘవి వెనుకపడేవాడు. సంఘవి హైదరాబాద్ వచ్చి రామాంతాపూర్ హోమియో కాలేజీలో చేరినప్పటికీ తన వేధింపులు ఆపలేదు. తనను ప్రేమించాలని.. పెండ్లి చేసుకోవాలని పదే పదే ఆమెను విసిగించేవాడు. అందుకు సంఘవి తిరస్కరించేది. ఈ క్రమంలోనే సంఘవిపై కోపం పెంచుకున్న శివ.. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో నిందితుడు శివకుమార్ (26) వారింటికి వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో సంఘవి, పృథ్వీ మాత్రమే ఉన్నారు. వచ్చీ రావడంతో సంఘవితో గొడవపడ్డాడు. ఆపై వెంట తీసుకొచ్చిన కత్తులతో దాడికి యత్నించాడు. అక్కడే ఉన్న పృథ్వీ అడ్డుకునే ప్రయత్నం చేయగా కత్తితో అతడి ఛాతీపై బలంగా పొడిచాడు. తీవ్రంగా గాయపడిన పృథ్వీతేజ గాయం నుంచి రక్తం బయటకు రాకుండా చేత్తో అదిమిపట్టి బయటకు వచ్చి పక్కింట్లో ఉండే ఝాన్సీ అనే మహిళకు విషయం చెప్పి రోడ్డుపైకి పరుగులు తీశాడు. మరోవైపు, పృథ్వీ బయటకు వెళ్లిపోవడంతో సంఘవిని బెడ్రూంలోకి తీసుకెళ్లిన శివకుమార్ దాడికి పాల్పడ్డాడు. ఝాన్సీ ఇచ్చిన సమాచారంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి వస్తూ మార్గమధ్యంలో స్పృహతప్పి పడిపోయిన పృథ్వీని ఎల్బీనగర్లోని కామినేని దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయినట్టు ధ్రువీకరించారు.