Khairatabad | బంజారా హిల్స్, మార్చి 25 : ఏ క్షణంలోనైనా సుప్రీంకోర్టు తమ మీద అనర్హత వేటు వేస్తుందోఅన్న టెన్షన్ తో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సొంత పార్టీ నాయకులు కలిగిస్తున్న చికాకులు మరింత ఒత్తిడిని పెంచుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ ఆ పార్టీ బీఫామ్ పై లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల పార్టీ ఫిరాయింపు వ్యవహారం లో సుప్రీంకోర్టులో విచారణ వేగవంతం కావడంతో ఎలాగైనా ఉప ఎన్నిక ఖాయమని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
బీఆర్ఎస్ అధిష్టానం సైతం త్వరలోనే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు తప్పదు.. ఉప ఎన్నిక ఖాయమనే సంకేతాలను ఇస్తూ క్యాడర్ ను ఉప ఎన్నికకు సిద్ధం కావాలంటూ ఆదేశాలు జారీ చేస్తుంది. ఇదిలా ఉండగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యం అని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు టికెట్ కోసం రంగంలోకి దిగారు. ఎలాగూ ఎమ్మెల్యే దానం నాగేందర్ మీద అనర్హత వేటు పడడం ఖాయమని, తర్వాత వచ్చే ఉప ఎన్నికల్లో టికెట్ మాకే అంటూ తమ అనుచరుల ముందు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కార్పొరేటర్ రాజు యాదవ్ అభిమానుల పేరుతో నియోజకవర్గంలో వెలిసిన ప్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యం అయితే కాంగ్రెస్ పార్టీ తరపున రాజు యాదవ్ కు టికెట్ కేటాయించాలంటూ మంగళవారం పలుచోట్ల ప్లెక్సీలు వేశారు. ఏఐసీసీ అగ్ర నేతల నుంచి గ్రేటర్ హైదరాబాద్ లోని అందరు కాంగ్రెస్ నేతల ఫొటోలు రాజు యాదవ్ ప్లెక్సీలో ఉండడం విశేషం.