సిటీబ్యూరో, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): వృద్ధులను లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్‌లతో బెదిరింపులకు పాల్పడుతూ లక్షల రూపాయలు కాజేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్‌లలో నకిలీ పోలీసులు, నకిలీ సుప్రీంకోర్టుల సెట్టింగ్‌లు వేసి మరీ హెచ్చరికలు జారీ చేస్తూ వృద్ధుల సేవింగ్స్ ఖాతాలతో పాటు ఎఫ్డీలను సైతం వితడ్రా చేయించి తమ అకౌంట్లలో బదిలీ చేయించుకుంటున్నారు. రెండు గంటల్లో సిమ్ కార్డు బ్లాకింగ్, మనీలాండరింగ్, హ్యుమన్ ట్రాఫికింగ్ తదితర నేరాల పేరు చెబుతూ బెదిరింపులకు దిగుతున్నారు.
ఒకటి రెండు కాదు ఏకంగా కోట్ల రూపాయలు డిజిటల్ అరెస్ట్‌లతో అమాయకుల నుంచి నేరగాళ్లు వసూలు చేస్తుండటం ఆందోళన కల్గిస్తోంది. ఇలాంటి ఘటనలను నిలువరించేందుకు సీనియర్ సిటిజన్స్‌తో విస్త్రతంగా అవగాహన తీసుకొచ్చే కార్యక్రమాలు చేయాల్సిన అవసరముంది. దీనికి కమ్యూనిటీ పోలీసింగ్‌ను ఉపయోగించుకొని ఆయా కాలనీలు, బస్తీలలలో ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్స్ కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన పోలీసులు ఆ విషయాన్ని విస్మరిస్తున్నారనే విమర్శలున్నాయి.
విలువలతో కూడిన జీవితం గడిపి వృద్ధాప్యంలో కేసులు, పోలీసులు అని చెప్పేవరకు వారిలో భయం నెలకొంటుంది, దానికి తోడు కోర్టుల పేర్లను కూడా సైబర్‌నేరగాళ్లు ఉపయోగిస్తుండటంతో మరింత భయంతో వృద్ధులు వణికిపోతున్నారు. ప్రతి నెల ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలోనే డిజిటల్ అరెస్ట్‌కు సంబంధించిన 10 నుంచి 15 కేసుల వరకు నమోదువుతున్నాయి. అందులో బాధితులు చాల వరకు వృద్ధులే ఉంటున్నారు.
అలాంటి వారి నుంచే ఎక్కువ మొత్తంలో డబ్బును సైబర్‌నేరగాళ్లు కాజేస్తున్నారు. వృద్ధ్దులలో డిజిటల్ అరెస్ట్‌లు, నకిలీ కేసులు, నకిలీ పోలీసులు, కోర్టులకు సంబంధించిన చర్చ జరుగాలి, అందుకు ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్స్‌లో అవగాహన తీసుకురావడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.
నగరంలో ఇటీవల నమోదైన సైబర్ దోపిడీ కేసులు..
గ్రీన్‌హిల్స్ కాలనీలో నివాసముండే రిటైర్డు ఉద్యోగికి గత నెల 24వ తేదీన గుర్తుతెలియని వ్యక్తి తాను టెలికమ్యూనికేషన్ డిపార్టుమెంట్ నుంచి మాట్లాడుతున్నానంటూ ఫోన్ చేశాడు. మీ ఫోన్ నెంబర్ దుర్వినియోగం అయ్యిందని దీనికి సంబంధించిన బెంగుళూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యిందని, అందుకు సంబంధించి మీతో పోలీసులు మాట్లాడుతారంటూ ఇద్దరు నకిలీ పోలీసులతో మాట్లాడించాడు. సాదత్ ఖాన్ అనే వ్యక్తిని హ్యూమన్ ట్రాఫిక్ కేసులో అరెస్ట్ చేశాం, ఆయన కంబోడియా, మయన్మార్, ఫిలిప్పీన్ దేశాలకు అక్రమ పద్దతిలో మనుషులను రవాణా చేస్తున్నాడు.
ఆ కేసు విచారణలో మీ పేరు కూడా బయటకు రావడంతో బెంగుళూరు, ఢిల్లీలో సీబీఐ కేసులు నమోదు చేసిందని, దీనిపై మిమ్మల్ని అరెస్ట్ చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చిందని భయపెటెట్టించారు. సుప్రీంకోర్టు జడ్జి ముందు మిమ్మిల్ని వీడియో కాల్లో మాట్లాడిస్తామంటూ ఫేక్ సుప్రీంకోర్టు జడ్జిని క్రియేట్ చేసి అతనితో మాట్లాడించారు, మీ బ్యాంకు ఖాతాలు అసెస్మెంట్ చేయాలి, మీ ఖాతాలలో ఉన్న డబ్బంతా ఆర్బీఐ ఖాతాకు పంపించండి, మీకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని తేలిన తరువాత మీ డబ్బు తిరిగి మీ ఖాతాలో డిపాజిట్ అవుతుందని నమ్మించి ఆయన ఖాతాలో ఉన్న రూ. 38 లక్షలు కాజేశారు.
అమీర్‌పేట్‌కు చెందిన 77 ఏండ్ల వృద్దుడికి పోలీసు యూనిఫామ్‌లో ఢిల్లీ నుంచి డీసీపీ రాజీవ్‌కుమార్‌ను మాట్లాడుతున్నానంటూ సైబర్‌నేరగాడు మాట్లాడాడు. మీపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యిందని, మనీలాండరంగ్ కేసులో మీపై ఆరోపణలు వచ్చాయి, మీ ఆధార్‌కార్డు వాడారు, మీ బ్యాంకు ఖాతాలన్నీ ఫ్రీజ్ చేయాలని సుప్రీంకోర్టు అర్డర్ ఇచ్చిందంటూ భయపెట్టించాడు. వాట్సాప్ కాల్లో మాట్లాడుతూ మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఉండాలంటే మీ బ్యాంకు ఖాతాలు తనిఖీ చేసి సుప్రీంకోర్టు, ఆర్బీఐ పర్యవేక్షణలో వాటిని చేయాలని సూచిస్తూ వాట్సాప్‌లో నకిలీ నోటీసులు పంపించారు. దీంతో బెదిరిపోయిన బాధితుడు సైబర్ నేరగాళ్లు చెప్పినట్లు అతని ఖాతాలలో ఉన్న రూ. 53 లక్షలు సైబర్ నేరగాళ్ల ఖాతాలోకి బదిలీ చేసి మోసానికి గురయ్యాడు.
మనీలాండరింగ్ కేసుతో మీకు సంబంధాలున్నాయని అనుమనాలున్నాయి. మిమ్మిల్ని అరెస్ట్ చేయాలని సుప్రీంకోర్టు వారెంట్ జారీ చేసింది, అయితే అరెస్ట్ కాకుండా ఉండాలంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మీరు రూ. 58 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ చేసి దర్యాప్తునకు సహకరించాలని బెంగుళూర్ పోలీసులు మాట్లాడుతున్నట్లు సైబర్‌నేరగాళ్లు సరూర్‌నగర్‌కు చెందిన ఒక రిటైర్డు ఎస్ఈని డిజిటల్ అరెస్ట్ చేసి రూ. 58 లక్షలు దోచేశారు.
ఢిల్లీలో మీపై కేసు నమోదయ్యింది, నేరుగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ కేసు విచారణ జరగుతుంది, సుప్రీంకోరు చీఫ్ జస్టిస్ వీడియో కాల్లో మిమ్మల్ని విచారిస్తారంటూ ఈసీఐఎల్ ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేట్ రిటైర్డు ఉద్యోగిని డిజిటల్ అరెస్ట్‌తో బెదిరించి రూ.1.34 కోట్లు దోచేవారు.
ఎల్బీనగర్కు చెందిన రిటైర్డు ప్రభుత్వ ఉద్యోగి దంపతులకు టెలిఫోన్ డిపార్టుమెంట్ నుంచి మాట్లాడుతున్నామని, మీ నంబర్‌కు చాలా కేసులతో సంబంధాలున్నాయిని, మీ ఫోన్ బ్లాక్ అవుతుందని, దీనికి సంబంధించిన మీకు బెంగుళూర్ పోలీసులకు కనెక్ట్ చేస్తున్నాను మాట్లాడంటూ నకిలీ పోలీసులతో మాట్లాడించారు. హ్యుమన్ ట్రాఫిక్‌కు సంబంధించి మీపై బెంగుళూరుతోత పాటు ఢిల్లీ సైబర్ సెల్లో, సీబీఐలో కేసు నమోదయ్యిందంటూ బెదిరించారు.
అయితే మీకు ఈ కేసుతో సంబంధం లేదు అని నిరూపించుకోవాల్సిన అవసరముంటుందని, అందుకు మీ బ్యాంకు ఖాతాలలో ఉన్న డబ్బును ఆర్బీఐ ఖాతాకు బదిలీ చేయాలని సూచించారు. మీకు రోజు ఉదయం వాట్సాప్‌లో వీడియో కాల్ చేస్తామని, అప్పుడు మాట్లాడాలని, ఈ విషయం ఎవరితోను చెప్పొద్దంటూ 45 రోజుల పాటు సైబర్ నేరగాళ్లు వాళ్లను డిజిటల్ అరెస్ట్ చేశారు. ఈమధ్య కాలంలో ఖాతాలు అసెస్మెంట్ చేయాలని, ఆదాయపన్ను చెల్లించాలంటూ బెదిరిస్తూ రూ. 46 లక్షలు కాజేశారు.