కేపీహెచ్‌బీ కాలనీ, జూన్ 21 : కూకట్పల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, సినీ నిర్మాత గొట్టిముక్కల పద్మారావు ఆనారోగ్యంతో కన్నుమూసారు. కూకట్‌పల్లిలో తన నివాసంలో ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడువగా…రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సినిమాలతో పాటు రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన పద్మారావు 1970 తెలంగాణ తొలిదశ ఉద్యమంలో పాల్గొని జైలు జీవితాన్ని గడిపారు. దివంగత నేత పీజేఆర్ అనుచరుడిగా కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు.తదనంతరం టీడీపీలో కొంతకాలం పనిచేసి, తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరాడు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పిలుపుతో బీఆర్ఎస్ పార్టీలో చేరి, కూకట్పల్లి ప్రాంతంలో తెలంగాణ వాదులతో కలిసి పోరాటాలు చేశారు. ప్రత్యేక రాష్ట్రంలో 2014లో జరిగిన తొలి ఎన్నికలలో కూకట్పల్లి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. తదనంతరం రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీలో చేరి, 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల వేళా… కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరా రు. గత కొద్ది కాలంగా ఆనారోగ్యంతో చికిత్స పొందుతు న్న ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
నివాళులర్పించిన ఎమ్మెల్యే కృష్ణారావు
కూకట్పల్లి వివేకనందనగర్‌లో గొట్టిముక్కల పద్మారావు నివాసంలో పద్మారావు పార్ధివ దేహానికి శాసన మండలి సభ్యుడు నవీన్‌కుమార్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులు పుష్పగుచ్చాలతో నివాలర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ సతీష్ఆరోరా, మాజీ కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, తూము శ్రావణ్‌కుమార్, బీఆర్ఎస్ నేతలు నాయినేని తులసిరావు, గొట్టిముక్కల వెంగల్రావు, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలు నివాళులర్పించారు.