ఆర్కేపురం, మార్చి 13 : బండి సంజయ్ ఒంటెత్తు పోకడలు, వ్యక్తిగత, ఆర్థిక స్వార్థం వల్ల పార్టీకి తీరని నష్టం చేకూరుతున్నదని బీజేపీ సీనియర్ నాయకుడు పెరాల శేఖర్జి ఆరోపించారు. సోమవారం ఆర్కేపురం డివిజన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడింది కరెక్ట్ అని కిషన్రెడ్డి, లక్ష్మణ్, ఇతర పెద్దలు చేయాల్సిన పని ఆయన చేశారని అన్నారు. అధ్యక్షుడి పరిణతి లేని సందర్భ అసందర్భమాటలు, వ్యవహారం, నియంతృత్వం, అప్రజాస్వామిక చేష్టలు బీజేపీలో ఈ పరిస్థితికి కారణమన్నారు. మసీదుల తవ్వకాలు, ముద్దులు పెట్టడాలు, బ్లాక్ మెయిల్ ఇష్యూస్ లేవదీసి అంతర్గతంగా సెటిల్మెంట్లు, సుదీర్ఘ కాలంగా ఉన్న కార్యకర్తలను అవమానిస్తున్నారని మండిపడ్డారు. దశాబ్దాలుగా పనిచేస్తున్న నాయకులను పక్కనబెట్టి సికింద్రాబాద్ కంటోన్మెంట్ వీసీ పోస్టును ఆర్థిక కారణాల వల్ల కొత్తవారికి ధారాదత్తం చేశారని తెలిపారు. వీటన్నింటినీ నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. పార్టీలో వినే సంస్కృతి, చర్చించే పద్ధతి మాయమైనప్పుడు సోషల్ మీడియా ఆధారమవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం మన బీజేపీ పరిస్థితి 3 అడుగులు ముందుకు.. 6 అడుగులు వెనక్కు అన్నట్లు ఉందని తెలిపారు. దీనికి పార్టీ రాష్ట్ర నాయకత్వ లోపమే కారణమన్నారు.