మేడ్చల్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): నాలుగు గ్యారంటీల అమల్లో లబ్ధిదారుల ఎంపిక అయోమయంగా మారింది. మేడ్చల్ జిల్లాలో నాలుగు రోజుల పాటు జరిగిన గ్రామ, వార్డు సభల్లో ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను మాత్రమే చదివి వినిపించామని అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆదివారం పథకాలను అందించేలా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని ప్రభుత్వ ప్రకటనతో అంతా అయోమయం.. గందరగోళమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. నేడు నాలుగు గ్యారంటీల పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు కసరత్తు చేస్తున్న క్రమంలో లబ్ధిదారుల ఎంపికను ఏ ప్రతిపాదికన చేస్తారన్నది అర్థం కావడం లేదు.
లబ్ధిదారుల ఎంపిక జాబితా నేడు సాయంత్రం తేలిపోనున్నది. జాబితాలో పేర్లు రాని వారందరూ మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ మేరకు మళ్లీ దరఖాస్తులను ప్రజలు చేసుకోవాల్సి వచ్చింది. అయితే గ్రామ, వార్డు సభల్లో ప్రకటించిన జాబితా కేవలం దరఖాస్తుదారులదేనని స్పష్టం చేసిన అధికారులు.. ఎలాంటి సర్వే చేయకుండా లబ్ధిదారుల ఎంపిక ఎలా జరుగుతుందో దరఖాస్తుదారులకు అర్థం కావడం లేదు. లబ్ధిదారుల ఎంపికపై రీ సర్వే చేయాలని వస్తున్న డిమాండ్ల మేరకు అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది వేచి చూడాల్సిందే. కాగా, జిల్లాలో జరిగిన గ్రామ, వార్డు సభల్లో జీహెచ్ంఎసీ పరిధిలోనివి కాకుండానే 62,144 దరఖాస్తులు వచ్చాయి.
ప్రజాపాలనలో జిల్లాలోని జీహెచ్ఎంసీ పరిధితో పాటు మున్సిపాలిటీలు, గ్రామాల్లో రేషన్ కార్డులను సంబంధించి 1.22 లక్షలు, ఇందిరమ్మ ఇండ్ల పథకానికి 1.44 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గ్రామ, వార్డు సభల్లో రేషన్ కార్డుల కోసం 33,435, ఇందిరమ్మ ఇండ్ల పథకానికి 27,086, రైతు భరోసాకు 378, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 1,245 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.