సిటీబ్యూరో, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా చెన్నై నుంచి నగరానికి విదేశీ మద్యం రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను హైదరాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్(డీటీఎఫ్)అధికారులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.14లక్షల విలువ జేసే 60 విదేశీ మద్యం బాటిళ్లు, రవాణాకు వినియోగించిన ప్రైవేటు బస్సు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. చెన్నై నుంచి నగరానికి వస్తున్న ఓ ప్రైవేటు బస్సులో పెద్దఎత్తున విదేశీ మద్యం తరలిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు హైదరాబాద్ జిల్లా డీటీఎఫ్ ఇన్స్పెక్టర్ కంచర్ల కరుణారెడ్డి తన బృందంతో కలిసి నాంపల్లి మెట్రో స్టేషన్ వద్ద సదరు బస్సును ఆపి తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లోలో భాగంగా బస్సు డిక్కీ తెరిచి చూడగా.. 60 విదేశీ మద్యం బాటిళ్లు బయటపడ్డాయి. దీంతో బస్సు డ్రైవర్ ఇస్టమ్శెట్టి వెంకటరావు, అదనపు డ్రైవర్ పుట్ట మణికంఠను అదుపులోకి తీసుకుని విచారించగా.. చెన్నైకి చెందిన సతీశ్ అనే వ్యక్తి విదేశీ మద్యాన్ని అందజేశాడని, ఈ మద్యాన్ని నగరంలోని వెంకటాపురం శేషసాయికి అప్పగించాలని సూచించినట్లు వెల్లడించారు. అంతలోనే మద్యం తీసుకునేందుకు ద్విచక్ర వాహనంపై నాంపల్లికి వచ్చిన శేష సాయిని కూడా ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.14లక్షల విలువైన 60 విదేశీ మద్యం బాటిళ్లతోపాటు ప్రైవేటు బస్సు, ద్విచక్ర వాహనం, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును నాంపల్లి ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు.
హైదరాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సీహెచ్.విజయ్ ఆదేశాల మేరకు జరిపిన ఈ దాడుల్లో డీటీఎఫ్ ఇన్స్పెక్టర్ కె.కరుణారెడ్డి, ఎస్ఐలు ఉమారాణి, సంపత్‌కుమార్, కానిస్టేబుళ్లు జనార్దన్‌రెడ్డి, రాజు, వీరేందర్‌సింగ్ పాల్గొన్నారు.- మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల వ్యయ పరిశీలకులతో శనివారం రాచకొండ కమిషనరేట్ ఆధ్వర్యంలో పోలీసు, అధికార యంత్రాంగం ఉన్నతస్థాయి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు డీఎస్ చౌహాన్, స్టీఫెన్ రవీంద్ర జాయింట్ కమిషనర్లు తరుణ్ జోషి, అవినాష్ మహంతి, రంగారెడ్డి.. మేడ్చల్ జిల్లా కలెక్టర్లు భారతి, గౌతమ్ పొట్రు, ఎన్నికల పర్యవేక్షకులు ప్రేమ్ప్రకాశ్ మీనా, ప్రయ రంజన్ శ్రీవాస్తవ, శంకర్ గుప్త, వినోద్ కుమార్.. ఎక్సైజ్ శాఖ జీఎస్టీ, ఐటీశాఖల అధికారులతో సమన్వయ సమావేశంలో నిర్వహించి తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. అక్రమంగా తరలిస్తున్న నగదు, మద్యాన్ని జిల్లా మెజిస్ట్రేట్ సమక్షంలో సీజ్ చేయించాలని సూచించారు.