అమీర్‌పేట్, మే 3 : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దారని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పన, శాంతి భద్రతల నిర్వహణ, ఐటీ రంగం పురోగతి, రహదారుల విస్తరణ, విద్యుత్, రవాణ, పచ్చదనం, వరదనీటి కాలువల విస్తరణ, మంచినీటి, డ్రైనేజీ వ్యవస్థలను తీర్చి దిద్దడంలో గత ప్రభుత్వం పనిచేసిన తీరును ప్రజలు అర్ధం చేసుకున్నారన్నారు. అందుకే గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజలు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని పరిగణలోకి తీసుకుని ఓటర్లు బీఆర్ఎస్కు మద్ధతుగా నిలవాలని కోరారు.
నియోజకవర్గానికి ఎంపీగా ఎంతో చేసే అవకాశమున్నా, ఏమీ చేయలేకపోయిన బీజేపీ అభ్యర్థి జి.కిషన్‌రెడ్డి వైఖరిని, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలే ఎండగడుతున్నారన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి టి.పద్మారావుగౌడ్‌కు మద్దతుగా శుక్రవారం ఉదయం అమీర్‌పేట్‌లోని సుప్రభాత్నగర్ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ముందుగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న పద్మారావుగౌడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్ డివిజన్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మహిళలు మంగళహారతులు పడుతూ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకట్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, డివిజన్ అధ్యక్షుడు ఎం.హనుమంతరావు, నాయకులు అశోక్‌యాదవ్, కరుణాకర్‌రెడ్డి, కూతురు నర్సింహ, తదితరులు పాల్గొన్నారు.