సిటీబ్యూరో/ ఎల్బీనగర్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ వాసులను రెండంచుల కత్తి వేధిస్తున్నది. ఒకవైపు భానుడి ప్రతాపంతో ఉకిరిబికిరి చేస్తున్న ఉకపోత.. మరోవైపు సూర్యుడు అస్తమించగానే మొదలవుతున్న దోమల మోత. అవును..సిటీలో ఎకడ చూసినా దోమల దండయాత్రే కనిపిస్తున్నది. దోమలతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండాపోతున్నది. ఇటీవల ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి దోమ తెరను వేసుకొని మరీ అసెంబ్లీ మీడియా సాక్షిగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.
కాగా, బండ్లగూడ ఈకో పాలిటన్ గేటెడ్ కమ్యూనిటీలో ఓ సెక్యూరిటీ గార్డు రాత్రి సమయంలో దోమల నుంచి తప్పించుకునేందుకు ఏకంగా దోమ తెరను కప్పుకొని డ్యూటీ చేస్తున్నాడంటే.. దోమల బెడద ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే మని అడిగితే దోమల తీవ్రత చాలా ఉందని, వాటి నుంచి రక్షణకే దోమ తెరను కప్పుకొని విధులు నిర్వహిస్తున్నానని సదరు సెక్యూరిటీ గార్డు చెప్పాడు. ఇదిలా ఉంటే అదే కాలనీలో ఉండే బీఆర్ఎస్ నాయకురాలు సంబరాల శైలజ ఈకోపాలిటన్లో ఉంటున్న తన సోదరుడి ఇంటికి వచ్చారు. ఆ సమయంలో దోమ తెర కప్పుకొని విధులు నిర్వహిస్తున్న సదరు సెక్యూరిటీ గార్డు బాధను తెలియజేస్తూ..తీసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ప్రభుత్వం ఈ దుస్థితిని చూసైనా స్పందించి దోమల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు ప్రజలు కోరుతున్నారు.