సిటీబ్యూరో, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): క్విక్కర్ యాప్‌లో ఇల్లు అద్దెకివ్వబడునంటూ ప్రకటన ఇచ్చారు. యాడ్ చూసి సైబర్ నేరగాడు సంప్రదిస్తే అతని మాటలు నమ్మి రివర్స్ డబ్బులు పంపించి అడ్డంగా బుక్కయ్యారు. తీరా చూస్తే తాను మోసపోయా నని గ్రహించిన బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు లకు ఫిర్యాదు చేశారు. సికింద్రాబాద్‌కు చెందిన గృహిణి (40) తన ఫ్లాట్‌ను అద్దెకివ్వడానికి క్విక్కర్ యాప్‌లో ఒక ప్రకటన పోస్ట్ చేశారు.
గుర్తు తెలియని ఒక వ్యక్తి ఆమెను ఫోన్లో సంప్రదించి తాను ఆర్మీ ఆఫీసర్‌నంటూ పరిచయం చేసుకుని ఇంటి అద్దెకు సంబంధించి తమ అకౌంటెంట్ ఆమెను సంప్రదిస్తారని చెప్పాడు. మోసగాడు తమ అద్దె చెల్లింపు విధానం రివర్సల్ మోడ్‌లో ఉంటుందని చెప్పి అందుకు తగినట్లుగా బాధితురాలు ముందుగా రూ.5లు పంపిస్తే తిరిగి వాటిని పంపి సక్సెస్ అయినట్లుగా చెప్పారు.
అదే పద్ధతిని అనుసరించి మోసగాడు బాధితురాలిని ముందస్తు మొత్తాన్ని చెల్లించమని అడిగితే అకౌంట్ నుంచి డెబిట్ అయింది. అయితే ఈ విషయం మోసగాడికి తెలపగా ఆమె నెమ్మదిగా ఆపరేట్ చేస్తున్నందున క్రెడిట్ కావడం లేదని, నెఫ్ట్ ద్వారా పంపుతానంటూ ఆమె అకౌంట్ డిటైల్స్ తీసుకున్నాడు. ఆ ఖాతాలో డబ్బులు లేవని, అందులో డబ్బులు జమచేయాలని కోరగా ఆమె లోన్ తీసుకుని డబ్బులు వేసింది. ఆ తర్వాత మోసగాడు ఆమె ఎన్నిసార్లు కాల్ చేసినా స్పందించలేదని, ఈ వ్యవహారంలో రూ.1,30,980లు కోల్పోయినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.