సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ ఉజ్జ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ బందోబస్తును దగ్గరుండి సీపీ పర్యవేక్షించారు. సీపీ శ్రీనివాస్‌రెడ్డి, తన సతీమణితో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. అన్ని శాఖల సమన్వయం, 1500 మంది పోలీసు అధికారులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
అన్ని శాఖలతో కలిసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకున్నట్టు సీపీ పేర్కొన్నారు. మహిళా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా షీ టీమ్స్‌ను రంగంలోకి దింపినట్టు చెప్పారు. జేబు దొంగతనాలు జరగకుండా క్రైమ్ టీమ్స్‌తో ప్రత్యేక నిఘా కొనసాగించినట్లు తెలిపారు. ఆలయం, పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా ఉన్నదన్నారు. ట్రాఫిక్ పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. సీపీ వెంట నగర అదనపు పోలీస్ కమిషనర్లు విక్రమ్ సింగ్ మాన్, విశ్వప్రసాద్, నార్త్‌జోన్ డీసీపీ, టాస్క్‌ఫోర్స్ డీసీపీ తదితర అధికారులు ఉన్నారు.