సికింద్రాబాద్, డిసెంబర్ 3: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సికింద్రాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తీగుళ్ల పద్మారావుగౌడ్ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. 2014, 2018 ఎన్నికలలో ఘన విజయాన్ని అందుకున్న పద్మారావుగౌడ్‌కు బీఆర్ఎస్ అధిష్టానం తిరిగి సికింద్రాబాద్ సీటును తిరిగి కేటాయించింది. గత ఎన్నికల్లో కంటే ఈసారి అత్యధికంగా 45 వేల 625 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు.
సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఓయూ డీఆర్సీ సెంటర్లో ఎన్నికల కౌంటింగ్‌లో అధికారులు 14 టేబుళ్లు, 16 రౌండ్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు ఆరంభమైన సికింద్రాబాద్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదటి రౌండ్ నుంచే పద్మారావుగౌడ్ ఆధిక్యం ప్రదర్శిస్తూ వచ్చారు.
మొదటి రౌండ్ నుంచే పద్మారావుగౌడ్ ముందంజలో ఉంటూ వచ్చారు. మొత్తం 16 రౌండ్లలో ఓట్లను లెక్కించారు. కాగా, మొదటి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థిపై 6వేల212 ఓట్ల లీడ్ ఇవ్వగా సెకండ్ రౌండ్లో 5 వేల 228, మూడో రౌండ్లో 4వేల131, నాలుగో రౌండ్లో 5వేల 204, ఐదో రౌండ్లో 5వేల706 ఆధిక్యంలో ఉన్నారు. ఆరో రౌండ్లో 5వేల 241, ఏడో రౌండ్లో 5వేల 335, ఎనిమిదో రౌండ్లో 5వేల551, తొమ్మిదో రౌండ్లో 3వేల 890 లీడ్ రాగా ఆ తరువాతీ రౌండ్ ముగిసే సరికి 28వేల 660 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. తొమ్మిదో రౌండ్‌తో కలిపి పద్మారావుగౌడ్‌కు 46వేల 498 ఓట్లు వచ్చాయి.
సికింద్రాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా 2,56,555 ఓటర్లు ఉండగా అందులో మహిళలు 1,30,716, పురుషులు 1,29,144, ఇతరులు 25 మంది ఓటర్లు ఉన్నారు. గత నెల 30న జరిగిన ఎన్నికల్లో మొత్తంగా సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 1,41,104 ఓట్లు పోల్ అయ్యాయి. ఇందులో బీఆర్ఎస్కు 77,910, కాంగ్రెస్‌కు 32,598, బీజేపీ పార్టీకి 25,012 ఓట్లు వచ్చాయి. అలాగే, పోస్టల్ బ్యాలెట్లలో బీఆర్ఎస్ 313, కాంగ్రెస్ 305, బీజేపీకి 190 ఓట్లు వచ్చాయి.