కంటోన్మెంట్, జూలై 5: కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన సర్వీస్ చార్జీలను వెంటనే విడుదల అయ్యేలా చూడాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్(డీజీడీఈ) అధికారి ప్రచూర్ గోయెల్‌ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం డీజీడీఈ ప్రచూర్ గోయెల్ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయాన్ని సందర్శించి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే సాయన్న, మర్రిరాజశేఖర్‌రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో డీజీడీఈని కలిసి బోర్డు పరిధిలోని అంశాలపై వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని బజార్లను, పలు ప్రాంతాలను కంటోన్మెంట్ భూములుగా నివేదిక ఇవ్వడంతో సమస్యగా మారిందని పేర్కొన్నారు. బొల్లారం కంటోన్మెంట్ జనరల్ దవాఖానలో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. అదేవిధంగా బోర్డు ఎన్నికలు నిర్వహించాలని కోరారు. బోర్డు పరిధిలో ఉన్న ప్యాట్నీ నాలా ఆధునీకరణకు రాష్ట్ర సర్కారు రూ. 10 కోట్లు విడుదల చేసిందని, బోర్డు పరిధిలోని ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ కింద సుమారు రూ.100 కోట్లు కేటాయించేలా చొరవ తీసుకోవాలన్నారు. డీజీడీఈ ప్రచూర్ గోయెల్ సానుకూలంగా స్పందిస్తూ బోర్డు అభివృద్ధికి సంబంధించి పక్కా ప్రణాళికతో ముందుకెళ్లేలా చర్యలు చేపడుతామని వ్యాఖ్యానించారు.