సికింద్రాబాద్, నవంబర్ 6: 2022 జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండిన వారి పేర్లను ఓటరు జాబితాలో చేర్చడంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని కంటోన్మెంట్ బోర్డు సీఈవో అజిత్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం బోర్డు కార్యాలయంలో 4,5 వార్డులలోని పలు కాలనీలకు చెందిన అధ్యక్షులు, కార్యదర్శులతో ఓటరు నమోదు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో శేషాచల కాలనీ, న్యూ ఎస్బీహెచ్ కాలనీ, రైల్వే కాలనీతో పాటు పలు కాలనీల సంక్షేమ సంఘాల నేతలు పాల్గొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా నవంబర్ మొత్తంలో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సీఈవో తెలిపారు. దరఖాస్తు చేసుకునే సందర్భంలో ఫారం 6ని ఓటరు జాబితాలో పేర్ల నమోదుకు ఈ దరఖాస్తులను పూర్తి చేసి ఇవ్వాలన్నారు.
ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి నివాసం మారితే ఫారం-6లో ఉన్న పార్టు-4లో వివరాలు పొందుపర్చి సమర్పించాలని సూచించారు. ఓటరు జాబితాల్లో పేర్లపై అభ్యంతరాలు తెలియజేయడానికి ఫారం-7ను వినియోగించాల్సి ఉంటుందన్నారు. ఆదే విధంగా పేర్లలో మార్పులు, దిద్దుబాట్లకు ఫారం-8లో వివరాలు పొందుపర్చాలని, శాసనసభ నియోజకవర్గ పరిధిలో చిరునామా మార్పునకు, బదిలీ కోసం ఫారం-8ఎను వినియోగించాలని పేర్కొన్నారు. ఆదివారంతో పాటు ఈ నెల 27, 28 తేదీల్లో ఓటర్ల నమోదుకు సంబంధించి ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అధికారులతో పాటు కాలనీల ప్రతినిధులు రాజశేఖర్, రాజు, హరినాథ్, మహేశ్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
అడ్డగుట్ట, నవంబర్ 6 : అడ్డగుట్ట, మెట్టుగూడ డివిజన్లలో నూతన ఓటరు నమోదుకు అధికారులు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. కొత్త ఓటర్ కార్డుతో పాటు అందులో మార్పులు, చేర్పులు చేసుకోవడానికి ఆయా ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి దరఖాస్తులను తీసుకున్నారు. ఈ అవకాశం ఆదివారం కూడా ఉంటుందని, కావున ప్రజలు ఎవరైతే ఓటర్‌గా నమోదు చేసుకోలేదో వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మారేడ్‌పల్లి, నవంబర్ 6: మారేడ్‌పల్లి కస్తూర్బా గాంధీ మహిళా డిగ్రీ, పీజీ కళాశాల ఆవరణలో శనివారం ఓటరు నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ దీపిక విద్యార్థులకు ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించారు. ఓటరు హెల్ప్‌లైన్ యాప్ ద్వారా కూడ ఫారం నెంబర్-6 నూతన ఓటర్లుగా నమోదు, సవరణలకు ఫారం నెంబర్-8, జాబితాలో పేరు తొలగింపు ఫారం-7 రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.