సికింద్రాబాద్, అక్టోబర్ 21: ఆజాద్ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ నెల 24న కంటోన్మెంట్లో 4కే మారథాన్ రన్‌ను నిర్వహిస్తున్నట్లు కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అజిత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశభక్తిని చాటుకునే ప్రతి ఒక్కరూ 4 కిలోమీటర్ల పరుగు పందెంలో పాల్గొనాలని సూచించారు. ఈ నెల 24న సిఖ్విలేజ్లోని హాకీ స్టేడియం నుంచి ఉదయం 6:30 గంటలకు ప్రారంభం కానున్న పరుగు పందెం డైమండ్ పాయింట్, ఎన్సీసీ మడ్‌ఫోర్ట్ గ్రౌండ్, టివోలీ మీదుగా తిరిగి హాకీ స్టేడియం చేరుకుంటుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీఓసీ ప్రీతిపాల్ సింగ్ హాజరుకానున్నట్లు తెలిపారు. వీరితో పాటు ఆర్మీ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, మాజీ బోర్డు ఉపాధ్యక్షులు, బోర్డు మాజీ సభ్యులతో సహ కంటోన్మెంట్ పరిధిలోని ఆయా కాలనీవాసులు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యేలా కృషి చేస్తున్నామని చెప్పారు. పరుగుపందెంలో మొదటి బహుమతిగా రూ.5వేలు, రెండో బహుమతి రూ.3వేలు, మూడో బహుమతిగా రూ. 2వేల నగదు ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం పరుగుపందెంకు సంబంధించిన క్యాప్, టీషర్ట్స్‌ను ఆవిష్కరించారు.