సిటీబ్యూరో, జూలై 8(నమస్తే తెలంగాణ): 302, 307 టాటూలతో భయపెడుతాడు. ఇవేంటి అనుకుంటున్నారా..! ఇవి మర్డర్, అటెంప్ట్ మర్డర్ కేసులకు సంబంధించిన సెక్షన్లు. వీటిని తన చేతులపై, మెడకు రెండువైపులా వేసుకుని దారినపోయేవారిని అటకాయించడం, వారిని బెదిరించడం అతనికి అలవాటు. అల్వాల్ పీఎస్ పరిధిలోని రౌడీషీటర్ అబ్దుల్ సలామ్‌ను బోయిన్పల్లి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
నిందితుడు అబ్దుల్ సలామ్ హస్మత్‌పేటలోని విజయదుర్గ వైన్స్ వద్ద అబ్దుల్ మజీద్ అనే వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా.. అటకాయించి అతడిపై కత్తితో దాడిచేసి గాయపరిచాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడిని అతని ఇంట్లో అరెస్ట్ చేశారు. నిందితుడి చేతులపై, మెడపై 302(మర్డర్ కేసు), 307(అటెంప్ట్ మర్డర్ కేసు)కు సంబంధించిన టాటూలు ఉండటం గమనించిన పోలీసులు అతడిని ప్రశ్నిస్తే ప్రజలను భయపెట్టడానికి తాను ఈ రెండు సెక్షన్లు టాటూలుగా వేసుకున్నానని చెప్పాడు.నిందితుడు అబ్దుల్సలామ్పై అల్వాల్, బోయినపల్లి పీఎస్ పరిధిలో ఐదు క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు.